క్యాబ్‌ బుకింగ్‌ ఫెయిలైందా? ఫార్మింగ్‌ ఎటాక్‌తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!

9 Feb, 2023 11:21 IST|Sakshi

సాక్షి, ముంబై:  సైబర్‌ నేరగాళ్ల  ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో క్యాబ్‌ బుక్‌ చేస్తూ  ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్‌ ఏజెంట్‌  చేతిలో మోసపోయి  రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్‌ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ  టెక్నికల్‌ లోపం కారణంగా బుకింగ్‌ ఫెయిల్‌ అయింది.అయితే అతను ట్రావెల్‌ ఏజెన్సీ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు.

కొద్దిసేపటి తర్వాత ట్రావెల్‌ కంపెనీ ఏజెంట్‌  రజత్‌ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్‌ చేశాడు. బుకింగ్‌ కోసం మరోసారి వెబ్‌సైట్‌లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు.  వెబ్‌సైట్‌లో  సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్‌ చేశాడు. కానీ  భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్‌  అయిపోయాయి. క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్‌ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని  పోకుండా అడ్డుకోగలిగాడు.  కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు.

వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్‌ చేయించాడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్‌ సైబర్‌ దాడి అని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌, కంప్యూటర్‌ డీఎన్‌ఎస్‌ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్‌ వెబ్‌సైట్‌కు మళ్లించి, ఫిషింగ్‌ లింక్‌పై క్లిక్‌ చేయకపోయినా, నకిలీ వైబ్‌సైట్ల ద్వారా పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు.

ఫార్మింగ్‌ సైబర్‌  ఎటాక్‌ అంటే?
ఫార్మింగ్‌ సైబర్‌దాడులు ఫిషింగ్‌ ఎటాక్స్‌ కంటే ప్రమాదకరమని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా,  రియల్‌ వెబ్‌సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్‌ చేస్తారు. అంటే వెబ్‌సైట్ లేదా కంప్యూటర్  DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్‌ సైబర్‌ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్‌ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్‌సైట్లలో లింక్‌లను క్లిక్‌ చేయడం, డౌన్‌లోడ్‌ చేయడం  లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు