ఐటీ కంపెనీల పనితీరు భేష్‌!

4 Jan, 2022 04:39 IST|Sakshi

ఆదాయంలో 2.6–6 శాతం మధ్య వృద్ధి

 తొలుత టీసీఎస్, ఇన్ఫీ ఫలితాల లాభార్జనలో మిశ్రమ పనితీరుకు చాన్స్‌

క్యూ3పై ‘కొటక్‌’ నివేదిక

ముంబై: ఎగుమతుల ఆధారిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని సాధించనున్నాయి. సీజనల్‌గా చూస్తే నిజానికి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) బలహీన కాలంగా విశ్లేషకులు పేర్కొంటుంటారు. అయితే క్యూ3లో త్రైమాసికవారీగా ఆదాయాలు సగటున 2.6–6 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక అంచనా వేసింది. ట్రాన్స్‌ఫార్మేషన్‌పై వ్యయాలు పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం నుంచీ ఐటీ దిగ్గజాల క్యూ3 ఫలితాల విడుదల ప్రారంభంకానుంది.

బ్లూచిప్‌ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ తొలుత ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. వార్షిక ప్రాతిపదికన క్యూ3 ఆదాయ అంచనాలను కొటక్‌ నివేదిక వెల్లడించనప్పటికీ షేరువారీ ఆర్జన(ఈపీఎస్‌)పై మిశ్రమంగా స్పందించింది. కొన్ని కంపెనీల ఈపీఎస్‌లో 15 శాతం క్షీణతకు అవకాశముంటే.. మరికొన్ని దిగ్గజాలు 11 శాతంవరకూ వృద్ధిని అందుకోవచ్చని అభిప్రాయపడింది. సాఫ్ట్‌వేర్‌ రంగం ఎగుమతుల ఆధారితంకావడంతో డాలరు బలపడటం లాభించనున్నట్లు పేర్కొంది. ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడంతో 20–90 బేసిస్‌ పాయింట్లమేర మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు తెలియజేసింది.  

వృద్ధి బాటలో...
కొటక్‌ నివేదిక ప్రకారం లార్జ్‌ క్యాప్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో, టెక్‌ మహీంద్రా.. మిడ్‌ క్యాప్స్‌లో ఎల్‌టీ ఇన్ఫోటెక్‌ ముందుండే అవకాశముంది. ఆయా కంపెనీలు ఇటీవల సిబ్బందిని పెంచుకోవడం, ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలను ఇందుకు ప్రస్తావించింది. ఉద్యోగ వలసలు(ఎట్రిషన్‌) వేధిస్తున్నప్పటికీ డీల్స్‌ కుదుర్చుకోవడంలో సఫలంకావడం సానుకూలతలుగా పేర్కొంది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ 4.5 శాతం పురోగతి సాధించనుండగా.. ఇన్ఫోసిస్‌ 3.7 శాతం, టీసీఎస్‌ 2.6 శాతం చొప్పున వృద్ధి చూపవచ్చని బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ అంచనా వేసింది. మధ్యస్థాయి కంపెనీలు 5–6 శాతం పుంజుకోవచ్చని, వార్షికంగా చూస్తే మరింత అధికంగా సగటున 20–34 శాతం మధ్య ఆదాయాల్లో వృద్ధి నమోదుకావచ్చని విశ్లేషించింది. అయితే ఈపీఎస్‌ వృద్ధిలో విప్రో యథాతథంగా, ఇన్ఫోసిస్‌ 6 శాతం, టీసీఎస్, టెక్‌ మహీంద్రా 13–14 శాతం చొప్పున సాధించే వీలుండగా.. హెచ్‌సీఎల్‌ క్షీణతను చవిచూడవచ్చని పేర్కొంది.  

ఇబిట్‌ నీరసం...
క్యూ3లో వార్షికంగా సగటున అన్ని కంపెనీల నిర్వహణ (ఇబిట్‌) మార్జిన్లు మందగించవచ్చని కొటక్‌ నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం ఇందుకు ఎట్రిషన్‌ (ఉద్యోగుల వలసలు) రేటు, సీనియర్ల నియామకాలు, యుటిలైజేషన్‌ తగ్గడం, వ్యయాలు పెరగడం వంటివి ప్రభావం చూపనున్నాయి. కాగా.. ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ను 1 శాతంమేర పెంచి 17–17.5 శాతంగా ప్రకటించవచ్చు. తొలుత 12–14 శాతం వృద్ధి అంచనాలతో ఏడాదిని ప్రారంభించడం గమనార్హం. ఇక హెచ్‌సీఎల్‌ రెండంకెల ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. 12 శాతం పురోగతిని అందుకునే వీలుంది.

మరిన్ని వార్తలు