దేశంలో రికార్డ్‌ స్థాయిలో సౌర వెలుగులు!

20 Aug, 2022 11:48 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఈ ఏడాది జనవరి–జూన్‌ కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్‌ తోడైంది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్‌ ఇండియా రిసర్చ్‌ తెలిపింది. భారత సౌర విద్యుత్‌ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది. ‘గతేడాది జనవరి–జూన్‌లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్‌ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్‌–జూన్‌లో 59 శాతం అధికమై 3.9 గిగావాట్లు తోడైంది.

2022 జనవరి–జూన్‌లో, అలాగే జూన్‌ త్రైమాసికంలో ఈ రంగంలో అత్యధిక సామర్థ్యం జతకూడింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న ఖర్చులతో అధిక సవాళ్లు ఉన్నప్పటికీ సౌరశక్తి విషయంలో భారత్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని మెర్కామ్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ సీఈవో రాజ్‌ ప్రభు తెలిపారు. ఏప్రిల్‌–జూన్‌లో 9 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలు టెండర్లను పిలిచాయి. 2021తో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి సోలార్‌ మాడ్యూల్స్‌పై 40, సోలార్‌ సెల్స్‌పై 25 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ అమలవుతోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు.

చదవండి: మా రేంజ్‌ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన 

>
మరిన్ని వార్తలు