కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ

26 Sep, 2020 13:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు,అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయంటూ తన దగ్గర ఏమీ లేదంటూ మరోసారి చేతులెత్తేశారు. కేవల ఒక కారుతో చాలాసాధారణ జీవితాన్ని గడుపుతున్నానని వాపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం తన భార్య, ఇతర కుటుంబ సభ్యులు భరిస్తున్నారని, తన వద్ద చిల్లి గవ్వ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అంతేకాదు 2020 జనవరి-జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చుల కోసం 9.9 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మూడు చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఈ విషయం ప్రకటించారు. 

విచారణలో భాగంగా యుకె కోర్టు లగ్జరీకార్ల సముదాయం గురించి అంబానీని ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఒకకారును మాత్రమే ఉపయోగిస్తున్నానని,రోల్స్ రాయిస్ కారు లేనే లేదంటూ మీడియా ఊహాగానాలను అనిల్ తోసిపుచ్చారు. అంతేకాదు  ఆదాయాలు లేక విలాస జీవితం గాకుండా ఒక సాధారణ మనిషిగా జీవిస్తున్నానని తెలిపారు. అలాగే తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. తన తల్లికి 500 కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్‌కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నానన్నారు. టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి  కూడా బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది. అయితే అదంతా టీనాకు చెందిందే అని, కేవలం టీనా భర్తగా తన పేరు  ఉందని చెప్పుకొచ్చారు. 110,000 డాలర్ల విలువైన ఆర్ట్ పీస్ మాత్రమే తనదని వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్  ద్వారా 2019 , 2020 లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దక్షిణ ముంబైలోని తన ఇంటికి కరెంటు ఖర్చు గత  ఎనిమిది నెలల్లో  60.6 లక్షలని ప్రకటించారు. ప్రైవేట్ హెలికాప్టర్, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ వినియోగం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఎనిమిది నెలల్లో 60.6 లక్షల రూపాయల విద్యుత్ ఖర్చులను అనిల్ అంబానీ ప్రకటించారు.

మరోవైపు అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని  బ్యాంకుల తరఫున హాజరైన బంకిమ్ థంకీ క్యూసీ ఆరోపించారు.  తమకు రావాల్సిన  రుణ బకాయిలను  చట్టపరమైన మార్గాల ద్వారా పొంది తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం, 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ఆరవ ధనవంతుడిగా అలరారిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు.  దీనికి 2012లో అనిల్ అంబానీ తన రిలయన్స్ టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి. మూడు చైనా బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీపై 700 మిలియన్ డాలర్ల రుణం కోసం దావా వేసిన సంగతి తెలిసిందే. జూన్12 లోపు మూడు చైనా బ్యాంకులకు రూ .5,281 కోట్ల రుణాన్ని, రూ.7 కోట్లు చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న ఆదేశించింది. కాని పక్షంలో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపుల్లో అంబానీ విఫలం కావడంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి.

మరిన్ని వార్తలు