తెలుసుకున్నాకే ఫోన్‌ కొంటున్నారు

4 Apr, 2023 04:38 IST|Sakshi

ఈ విషయంలో భారతీయులే ముందు

డబ్బులకు తగ్గ విలువ ఉండాల్సిందే

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో కొత్త పోకడలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్‌ ఫోన్‌ ఇప్పుడు అత్యవసర వస్తువుల జాబితాలోకి వచ్చి చేరింది. పొద్దున లేవగానే, అలాగే పడుకునేప్పుడు ఫోన్‌ ముట్టుకోకుండా ఆ రోజు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదేమో. మరి అంతటి ప్రత్యేకత కలిగిన ఫోన్‌ కొనుగోలు విషయంలో బడెŠజ్‌ట్‌ ఒక్కటే కాదు కోరుకునే ఫీచర్లనుబట్టి మోడల్‌ ఎంపిక జరుగుతోందట.

స్తోమత లేనివారు, ఫోన్‌ వాడకం పెద్దగా అవసరం లేనివారు బేసిక్‌ ఫోన్లను వాడుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 60 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. బేసిక్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ల వైపు వినియోగదార్లు మళ్లుతుండడం, 5జీ విస్తరణ కారణంగా 2023లో ఈ సంఖ్య 100 కోట్లను దాటుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ధరల శ్రేణి, కోరుకుంటున్న ఫీచర్లు, వినియోగదార్ల అభిరుచులు వేటికవే ప్రత్యేకం.

విలువ ఉండాల్సిందే..
ధర ప్రాధాన్యం కాదు.. డబ్బుకు తగ్గ విలువ ఉండాల్సిందేనన్నది భారతీయుల ఆలోచన. రూ.15 వేలల్లో ఫోన్‌ కొనాలని భావించిన కస్టమర్‌ ముందు ఎక్కువ ఫీచర్లున్న ఫోన్‌ రూ.18 వేలకు లభిస్తే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఇక రూ.7 వేల లోపు, అలాగే రూ.30 వేలకుపైగా ఖరీదు చేసే ఫోన్ల ను 2–5 ఏళ్లు వాడుతున్నారట. అదే రూ.15–30 వేల సెగ్మెంట్లో ఆరు నెలలకే మార్చేస్తున్నారు. కారణం యువ కస్టమర్లు కావడం. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వినియోగదారులకే మొబైల్స్‌ పట్ల అవగాహన ఎక్కువ. రూ.15 వేల లోపు లభించే ఫోన్లే అధికంగా ఆఫ్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయి. రూ.15–30 వేల ధరల శ్రేణి మోడళ్ల అమ్మకాల్లో ఆన్‌లైన్‌ వాటా ఎక్కువ.  

ప్రపంచంలోనే ముందంజ..
స్మార్ట్‌ఫోన్ల పట్ల అవగాహన ఉన్న కస్టమర్లు భారత్‌లోనే అత్యధికం. కొనుగోలు కంటే ముందే ఆన్‌లైన్‌లో మోడళ్ల ఫీచర్లు, రివ్యూలను చూస్తున్నారట. ఈ విధంగా ముందే అవగాహనకు వచ్చి ఫోన్లను చేజిక్కించుకోవడంలో ప్రపంచంలో భారత్‌ ముందంజలో ఉందని రియల్‌మీ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ శ్రీ హరి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘మొబైల్‌ కొనుగోలు నిర్ణయంలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్మార్ట్‌ఫోన్‌ కొనే ముందు వీరిని సంప్రదిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న మోడళ్లు, ఫీచర్లు, రేటింగ్స్‌ వంటి విషయాలపై యువతకు ముందే అవగాహన ఉంటోంది’ అని వివరించారు.

ధర పరంగా చూస్తే..
► రూ.7,000 లోపు: ఈ విభాగంలో వినియోగదార్లకు కావాల్సింది ఏదైనా స్మార్ట్‌ఫోన్‌. వీరికి ఫీచర్లతో పనిలేదు. అత్యధికంగా ఫీచర్‌ ఫోన్‌ నుంచి ఇటువైపు మళ్లినవారే. ఇంకో విషయం ఏమంటే వినోదం కోసం పూర్తిగా వీళ్లు ఆధారపడేది ఈ స్మార్ట్‌ఫోన్‌పైనే.  
► రూ.7–15 వేలు: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ఈ విభాగం వాటా ఏకంగా 50 శాతం ఉంది. అధిక బ్యాటరీ, 6.5 అంగుళాలు, ఆపైన సైజున్న డిస్‌ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ కోరుకుంటున్నారు.
► రూ.15–30 వేలు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పట్టణ కస్టమర్లు ఎక్కువ. ముఖ్యంగా యూత్‌ అధికంగా కొనుగోలు చేసే ధరల శ్రేణి ఇది. మంచి డిజైన్, రెండు లేదా ఎక్కువ కెమెరాలు, అధిక రిజొ ల్యూషన్, ఫుల్‌ హెచ్‌డీ, అమోలెడ్‌ డిస్‌ప్లే, కర్వ్, 5జీ, ఫాస్ట్‌ చార్జింగ్, తక్కువ మందం ఉండాల్సిందే.  
► రూ.30 వేలు ఆపైన: ఇక్కడ ఫీచర్లు ప్రాధాన్యం కాదు. పెద్ద బ్రాండ్‌ అయి ఉండాలి. ఈ విభాగంలో కంపెనీలు ఎలాగూ ఒకదాన్ని మించి ఒకటి ఫీచర్లను జోడిస్తాయి అన్నది కస్టమర్ల మనోగతం.

మరిన్ని వార్తలు