ఇంట్లోనే ఆఫీస్‌ సెటప్‌!

12 Aug, 2020 04:41 IST|Sakshi

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యవంతంగా.. 

ఉద్యోగుల కోసం కంపెనీల ప్రత్యేక అలవెన్స్‌   

దీంతో పరికరాల కొనుగోలు

కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల బాగోగులు చూసుకునే సంస్థలు చాలానే ఉన్నాయి. తమ ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాల పేరిట అవసరంలో ఆదుకుంటూ పెద్ద మనసు చూపిస్తున్నాయి. కరోనా తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరిట కొత్త ట్రెండ్‌ను చూస్తున్నాం. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అంటే కార్యాలయానికి వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి నుంచే చేసుకోవచ్చనుకుంటే అది పొరపాటే! ఎందుకంటే కార్యాలయంలో మాదిరిగా ఇళ్లలో పని చేసేందుకు అనుకూలంగా పూర్తి స్థాయి సదుపాయాలు ఉండవు. దీంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్న వారు తమకు వెన్ను భాగంలో నొప్పి వస్తోందంటూ తమ ఇబ్బందులను బాస్‌ లతో పంచుకుంటున్నారు.

ఈ సమస్యను ప్రముఖ కంపెనీలు వెంటనే అర్థం చేసుకున్నట్టున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ప్రత్యేక భత్యాన్ని (అలవెన్స్‌) ఇవ్వడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఉద్యోగులు ఇంట్లోనూ సౌకర్యంగా కూర్చునేందుకు అనుకూలమైన కుర్చీ, టేబుల్‌ తదితర సదుపాయాలను సమకూర్చుకోగలరన్నది వాటి ఉద్దేశం. ప్రత్యేక అలవెన్స్‌ ఇవ్వడం కంపెనీలకూ ప్రయోజనకరమే. ఉద్యోగులు సౌకర్యంగా పనిచేయగలిగినప్పుడే కంపెనీల ప్రాజెక్టులు సకాలంలో ముందుకు కదులుతాయి. అందుకే కంపెనీ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త విశాలంగా ఆలోచించాయి.  

గూగుల్, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో, సేల్స్‌ ఫోర్స్, రేజర్‌ పే, వెరిజాన్‌ ఇండియా, సాస్‌ యూనికార్న్‌ ఫ్రెష్‌ వర్క్స్‌ .. ఇవన్నీ కూడా ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ ను ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఈ అలవెన్స్‌తో సౌకర్యవంతమైన చైర్, ఇతర పరికరాలు కొనుగోలు చేసుకోవాలన్నది కంపెనీల సూచన. కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యల్లో భాగంగా తయారీ మినహా మిగిలిన చాలా రంగాల్లోని కంపెనీలు 30–90 శాతం మేర ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫర్నిచర్‌ కంపెనీ గోద్రెజ్‌ ఇంటీరియో ఓ సర్వే నిర్వహించింది. వివిధ రంగాల్లోని కంపెనీలకు సంబంధించి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకుంది. 1,500 మంది ఉద్యోగులు ఈ సర్వేలో పాలు పంచుకోగా, అందులో 41 శాతం మంది నడుము, వెన్ను నొప్పి, మెడనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పడం గమనార్హం.  

‘‘కంపెనీకి సంబంధించి 6,000 మంది ఉద్యోగుల ఆరోగ్యం  మాకు ముఖ్యం. అందుకే ప్రత్యేకంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అలవెన్స్‌ ను ప్రకటించాము. ఇది ఉద్యోగులు అందరికీ ఒక్కసారి ఇచ్చే అలవెన్స్‌. తమ ఇంటి నుంచి పని చేయడానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతర్జాతీయంగా 13 ప్రాంతాల్లో పనిచేస్తున్న 3,100 మందికి ఒక్కొక్కరికి రూ.18,000 చొప్పున హమ్‌ ఆఫీస్‌ అలవెన్స్‌ ను అందించాము’’ అని వెరిజాన్‌ ఇండియా మానవ వనరుల డైరెక్టర్‌ గోపినాథ్‌ పి తెలిపారు. ‘‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూ ఎఫ్‌ హెచ్‌) అన్నది ఎక్కువ కాలం పాటు ఉంటుందన్నది మా అవగాహన.

దీంతో మా ఉద్యోగులు ఇంటి నుంచే సంతోషంగా పనిచేసేందుకు వీలుగా తగిన వసతులు వారు కల్పించుకునే విధంగా చూడాలనుకున్నాము’’ అని ఫ్రెష్‌ వర్క్స్‌ హ్యుమన్‌ రీసోర్సెస్‌ చీఫ్‌ సుమన్‌ గోపాలన్‌ వెల్లడించారు. ఇంటి నుంచి పని చేసే తమ ఉద్యోగులకు ఏమేమి అవసరమో తెలుసుకునేందుకు బేయర్‌ గ్రూపు అయితే ప్రత్యేకంగా ఒక సర్వే నిర్వహించింది. ‘‘సర్వే ఫలితాల ఆధారంగా ఆఫీస్‌ పరికరాలైన హెడ్‌ ఫోన్లు, కీబోర్డు, మౌస్, ల్యాప్‌ టాప్‌ స్టాండ్, వెన్నెముకకు మద్దతునిచ్చే పరికరాలను ఉద్యోగులకు అందించాము’’ అని బేయర్‌ గ్రూపు దేశీయ హెచ్‌ ఆర్‌ హెడ్‌ కేఎస్‌ హరీష్‌ తెలిపారు. డెస్క్‌ టాప్‌ మానిటర్లు, చైర్లను కూడా ఈ సంస్థ ఉద్యోగులకు సమకూర్చడం విశేషం.

ఫర్నిచర్‌ కంపెనీలకు పెరిగిన వ్యాపారం
ఆఫీస్‌ ఫర్నిచర్‌ తయారు చేసే కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఇంట్లోనే పని చేసేందుకు అనుకూలించే ఉత్పత్తులను అవి మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. గోద్రెజ్‌ ఇంటీరియో, స్టీల్‌ కేస్, హ్యుమన్‌ స్కేల్‌ ఈ విషయంలో ముందున్నాయి. ‘‘హోమ్‌ ఆఫీస్‌ సొల్యూషన్స్‌ విక్రయాలు సాధారణ రోజులతో పోలిస్తే గత కొన్ని నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. మా వెబ్‌సైట్‌ లో హోమ్‌ కేర్‌ ఉత్పత్తుల కోసం అన్వేషణ 140 శాతం పెరిగింది. ఏదో ఒక్క పరికరంతో (కుర్చీ లేదా టేబుల్‌) ఏకధాటిగా 8–10 గంటల పాటు పని చేయడం కష్టమే. ఉద్యోగులు దీన్ని అర్థం చేసుకున్నారు కనుకనే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరికరాలకు డిమాండ్‌ అంతగా పెరిగింది’’ అని గోద్రెజ్‌ ఇంటీరియో మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ జోషి వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా