పండగవేళ ప్రయాణికులకు షాక్‌! ఈ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ ఛార్జీల పెంపు

11 Jan, 2022 11:01 IST|Sakshi

సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో భారీ ఎత్తున ప్రజలు ప్రయాణాలకు సిద్ధమయ్యారు. పండగ వేళ రద్దీ నియంత్రణ పేరుతో ప్రజల నెత్తిన పిడుగు వేసింది రైల్వేశాఖ. స్టేషన్లలోకి ప్రయాణికులతోపాటు వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రాకను నియంత్రించేందుకు ప్లాట్‌ఫారమ్‌ ధరలను భారీగా పెంచింది. 

నగర పరిధిలో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 15 రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫారమ్‌ టిక్కెట్టు ధరలను పెంచుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నిత్యం లక్ష మందికి పైగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్‌ఫారమ్‌ టిక్కెట్టు ధరను రూ. 50 పెంచుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ప్రస్తుతం రూ.10 ఉన్న టిక్కెట్టు ధరను రూ. 20 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్‌ఫారమ్‌ టిక్కెట్ల పెంపు నుంచి నగర పరిధిలో కాచిగూడ స్టేషన్‌కు మినహాయింపు ఇచ్చారు. 

తెలంగాణలో
ఇక తెలంగాణ వ్యాప్తంగా వరంగల్‌, కాజీపేట, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాచలంరోడ్డు, మంచిర్యాల, రామగుండం, పర్లీ వైద్యనాథ్‌, తాండూరు, వికారాబాద్‌లతో పాటు కర్నాటకలోని బీదర్‌ రైల్వే స్టేషన్లలో కూడా రూ.10గా ఉన్న ఫ్లాట్‌ఫారమ్‌ టిక్కెట్టు ధర రూ.20కి పెరిగింది. పెరిగిన ఫ్లాట్‌ఫారమ్‌ టిక్కెట్టు ధరలు 2022 జనవరి 10 నుంచి 20 వరకు అమల్లో ఉంటాయి. 

ఏపీపై స్పష్టత లేదు
దక్షిణ మధ్యరైల్వే పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులో విస్తరించి ఉండగా ఇందులో తెలుగు రాష్ట్రాలే కీలకం. అయితే ఫ్లాట్‌ఫారమ్‌ టిక్కెట్‌ ధరల పెంపుకు సంబంధించి ఏపీ, మహరాష్ట్ర పరిధిలోకి వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్ల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణతో పాటు కర్నాటకలోని బీదర్‌కి సంబంధించిన వివరాలే వెల్లడించింది.

చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. భారీగా బాదుడు!

మరిన్ని వార్తలు