ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌

18 Sep, 2021 02:26 IST|Sakshi

గత ఆర్థికంలో 2.13 కోట్ల చ.అ. లావాదేవీలు

ఇందులో 66 శాతం వాటా సౌత్‌ రాష్ట్రాలదే

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీలలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతోంది. సప్లయి, లావాదేవీలు, అద్దెలు అన్నింట్లోనూ సౌత్‌ స్టేట్స్‌లోనే వృద్ధి నమోదవుతుంది. గత ఆర్థిక సంవత్సరం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.13 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 66 శాతంగా ఉంది. పశి్చమాది రాష్ట్రాల వాటా 21 శాతం, నార్త్‌ స్టేట్స్‌ వాటా 11 శాతంగా ఉందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది.

► 2020–21 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల్లోని 66 శాతం ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో 1.4 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. వెస్ట్‌ రాష్ట్రాల్లోని ట్రాన్సాక్షన్స్‌లో ముంబై, పుణే నగరాల్లో 45.6 లక్షల చ.అ. నార్త్‌లోని లావాదేవీల్లో ఎన్‌సీఆర్‌ నగరంలో 23 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. దేశంలోని టాప్‌–7 నగరాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో 3.11 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా దక్షిణాది రాష్ట్రాల వాటా 47 శాతం కాగా, పశి్చమంలో 33 శాతం, ఉత్తరంలో 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2018–19 ఆర్థికంలో 3.58 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. దక్షిణంలో 57 శాతం, వెస్ట్‌లో 25 శాతం, నార్త్‌లో 15 శాతం, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 4.3 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. సౌత్‌లో 55 శాతం, వెస్ట్‌లో 22 శాతం, నార్త్‌లో 20 శాతం వాటాలు కలిగి ఉన్నాయి.

సప్లయి కూడా సౌత్‌లోనే..
కొత్త ఆఫీస్‌ స్పేస్‌ సప్లయి కూడా దక్షిణాది రాష్ట్రాలనే ఎక్కువగా ఉంది. గత ఆర్థికంలో 4.02 కోట్ల చ.అ. సప్లయి జరగగా ఇందులో సౌత్‌ వాటా 63 శాతంగా ఉంది. పశ్చిమాది రాష్ట్రాల వాటా 19 శాతం, నార్త్‌ వాటా 18 శాతంగా ఉన్నాయి. 2019–20 ఆర్థికంలోనూ అంతే. మొత్తం 4.36 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. 59 శాతం దక్షిణాదిలో, 16 శాతం వెస్ట్‌లో, 24 శాతం ఉత్తరాది రాష్ట్రాలలో జరిగాయి.

డిమాండ్‌ ఎందుకంటే..
గత రెండు మూడేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో స్టార్టప్స్‌ విపరీతంగా పెరగడం, తయారీ, పారిశ్రామిక రంగాలు వృద్ధి బాటలో కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాలలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఏర్పడుతుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు.

హైదరాబాద్‌లో అద్దెల వృద్ధి
హైదరాబాద్‌లో నెలవారీ ఆఫీస్‌ స్పేస్‌ అద్దెలు పెరుగుతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చ.అ. రెంట్‌ నెలకు రూ.51 ఉండగా.. 2018–19 నాటికి రూ.53కు, 2019–20లో రూ.56కు, 2020–21 ఆర్థికం నాటికి రూ.57కి వృద్ధి చెందింది. గత ఆర్థికంలో నగరంలో గచ్చిబౌలిలో రెండు ప్రధాన ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. దివ్యశ్రీ ఓరియన్‌లో వెల్స్‌ఫార్గో 13 లక్షల చ.అ., సాలార్పూరియా సత్వా నాలెడ్జ్‌ క్యాపిటల్‌లో గూగుల్‌ 10 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను అద్దెకు తీసుకుంది. బెంగళూరులో గత ఆర్థికంలో చ.అ. అద్దె నెలకు రూ.77గా ఉంది. చెన్నై లో రూ.60, ఎంఎంఆర్‌లో రూ. 125, పుణేలో రూ.68, ఎన్‌సీఆర్‌లో రూ.78గా ఉంది. 

మరిన్ని వార్తలు