-

గోల్డ్‌ బాండ్‌ గ్రాము @ రూ. 5,611

6 Mar, 2023 03:56 IST|Sakshi

నేటి నుంచి కొత్త సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌

ముంబై: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం 2022–23.. తదుపరి దశలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గ్రాముకి రూ. 5,611 ధరను నిర్ణయించింది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఇష్యూ సోమవారం(6న) ప్రారంభంకానుంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్‌) ధర రూ. 5,611ను ఆర్‌బీఐ నిర్ణయించింది. కాగా.. ఆర్‌బీఐతో సంప్రదింపుల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకి నామినల్‌ విలువకు రూ. 50 డిస్కౌంట్‌ను ప్రకటించింది.

అయితే ఇందుకు ఇన్వెస్టర్లు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని డిజిటల్‌ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది.వెరసి గ్రాము గోల్డ్‌ బాండ్‌ ధర రూ. 5,561కు లభించనుంది. ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. వీటిని స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌హెచ్‌సీఐఎల్‌), కొన్ని పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా విక్రయిస్తారు. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి రిడెంప్షన్‌ను అనుమతిస్తారు.

ఫిజికల్‌ గోల్డ్‌కు డిమాండును తగ్గించే బాటలో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దేశీ పొదుపు సొమ్మును ఫిజికల్‌ గోల్డ్‌కు కాకుండా సావరిన్‌ గోల్డ్‌ కొనుగోలువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పూర్తి స్వచ్చత(999)గల బంగారం సగటు ధరను బాండ్లకు నిర్ణయిస్తారు. ఒక గ్రామును ఒక యూనిట్‌గా కేటాయిస్తారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లను కనిష్టంగా 1 గ్రాము, గరిష్టంగా 4 కేజీలవరకూ కొనుగోలుకి అనుమతిస్తారు. హెచ్‌యూఎఫ్‌లకు 4 కేజీలు, ట్రస్ట్‌లకు 20 కేజీల వరకూ యూనిట్ల కొనుగోలుకి వీలుంటుంది. 

మరిన్ని వార్తలు