25 నుంచి తాజా సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌

22 Oct, 2021 06:13 IST|Sakshi

అందుబాటులో ఐదు రోజులు

న్యూఢిల్లీ: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ తాజా ఇష్యూ ఈ నెల 25వ తేదీ నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే అక్టోబర్‌ 29వ తేదీ వరకూ ఇష్యూ అందుబాటులో ఉంటుంది. నవంబర్‌ 2న బాండ్‌ జారీ అవుతుంది. ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బాండ్‌ జారీ చేస్తుంది. 2021–22 సిరిస్‌లో ఇది ఏడవ విడత గోల్డ్‌బాండ్‌ స్కీమ్‌. 

చందా కాలానికి ముందు మూడు పనిదినాల్లో 999 ప్యూరిటీకి సంబంధించి ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యూయెలర్స్‌ అసోసియేషన్‌ పబ్లిష్‌ చేసిన సగటు ముగింపు ధరను ప్రాతిపదికగా తీసుకుని గోల్డ్‌ బాండ్‌ ధర నిర్ణయం అవుతుంది. అంటే అక్టోబర్‌ 20,21,22 తేదీల్లో పబ్లిష్‌ అయిన సగటు ముగింపు ధర బాండ్‌ ధరగా ఉంటుందన్నమాట. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారికి బాండ్‌ ధరపై గ్రాముకు రూ.50 రిబేట్‌ కూడా లభిస్తుంది.

2021 మే నుంచి బాండ్ల జారీ 2021–22 సిరిస్‌ ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం 10 విడతల బాండ్ల జారీ జరుగుతుండగా, 2021 సెప్టెంబర్‌ వరకూ ఆరు విడతలు పూర్తయ్యింది. అక్టోబర్‌ 25న జారీ అవుతున్న బాండ్‌తో కలుపుకుని 2022 మార్చి లోపు మరో నాలుగు విడతల్లో బాండ్ల జారీ జరగాల్సి ఉంది. నిర్ధారిత బ్యాంకులు, పోస్టాఫీసులు,  బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లీనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా బాండ్లను పొందవచ్చు.

మరిన్ని వార్తలు