నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం

20 Jun, 2022 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ: తదుపరి విడత సావరీన్‌ గోల్డ్‌ బాండ్ల (ఎస్‌జీబీ) విక్రయం సోమవారం ప్రారంభమై అయిదు రోజుల పాటు కొనసాగనుంది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్‌ బాండ్ల విక్రయం చేపట్టడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం 2015 నవంబర్‌లో ప్రారంభమైనప్పట్నుంచీ ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల         బంగారం విలువ) సమీకరించింది. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను       కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం    గమనార్హం.  

మరిన్ని వార్తలు