ఎస్‌అండ్‌పీ- నాస్‌డాక్‌.. రికార్డ్‌ రికార్డ్స్‌

19 Aug, 2020 10:40 IST|Sakshi

అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ దన్ను

నాస్‌డాక్‌- జూన్‌ నుంచీ 18వ సారి సరికొత్త గరిష్టానికి

ఎస్‌అండ్‌పీ- మార్చి కనిష్టం నుంచీ 55 శాతం అప్‌

87 ఏళ్ల మార్కెట్‌ చరిత్రలో అత్యధిక లాభాల రికార్డ్‌

ప్రధానంగా ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌ పురోగమించడంతో అమెరికన్‌ స్టాక్‌ ఇండెక్సులు మంగళవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఓవైపు డోజోన్స్‌ నీరసించినప్పటికీ ఎస్‌అండ్‌పీ-500, నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తాజాగా ఎస్‌అండ్‌పీ 8 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 3,390వద్ద ముగిసింది. తద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 19న 3,386 వద్ద నిలవడం ద్వారా సాధించిన సరికొత్త గరిష్టాన్ని తిరగరాసింది. అంతేకాకుండా మార్చి 23న నమోదైన కనిష్టం నుంచీ ఏకంగా 55 శాతం ర్యాలీ చేసింది! దీంతో గత 87ఏళ్లలో అత్యధిక లాభాలను ఆర్జించిన రికార్డును సైతం ఎస్‌అండ్‌పీ సొంతం చేసుకుంది. ఫలితంగా ఫిబ్రవరి- మార్చి మధ్య నెల రోజుల కాలంలోనే బేర్‌ ట్రెండ్‌ అంతమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది అమెరికా స్టాక్‌ మార్కెట్ చరిత్రలోనే అతితక్కువ కాలం నిలిచిన బేర్‌ మార్కెట్‌గా నమోదైనట్లు తెలియజేశారు.

నాస్‌డాక్‌ జోరు
ఈ ఏడాది జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్‌డాక్‌ మంగళవారం 81 పాయింట్లు(0.75 శాతం) ఎగసి 11,211 వద్ద నిలిచింది. వెరసి జూన్‌ నుంచీ ఇప్పటివరకూ నాస్‌డాక్‌ 18సార్లు సరికొత్త గరిష్టాలను నెలకొల్పడం విశేషం! అంతేకాకుండా 2020లో ఇప్పటివరకూ 34సార్లు ఈ ఫీట్‌ సాధించింది. కాగా.. రిటైల్‌ దిగ్గజాలు హోమ్‌ డిపో, వాల్‌మార్ట్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ షేర్లు 1 శాతం చొప్పున డీలాపడటంతో డోజోన్స్‌ 67 పాయింట్లు(0.25 శాతం) నీరసించి 27,778 వద్ద స్థిరపడింది.

టెస్లా దూకుడు
మంగళవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్‌, సోషల్‌ మీడియా దిగ్గజాలకు డిమాండ్‌ పెరిగింది. అమెజాన్‌ 4 శాతం జంప్‌చేయగా, గూగుల్‌ 2.7 శాతం ఎగసింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్‌ 2 శాతం, యాపిల్‌ 0.8 శాతం, మైక్రోసాఫ్ట్‌,  ఫేస్‌బుక్‌ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్‌ 2.8 శాతం పెరిగింది. 

ఆసియా అటూఇటుగా
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌కు సెలవుకాగా.. జపాన్‌, కొరియా 0.5 శాతం చొప్పున ఎగశాయి. సింగపూర్‌ నామమాత్ర లాభంతో కదులుతోంది. అయితే తైవాన్‌, చైనా, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా  0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. 

మరిన్ని వార్తలు