వేవ్‌లతో భారత్‌ ఎకానమీకి దెబ్బ,11 నుంచి 9.5 శాతానికి తగ్గిన వృద్దిరేటు

25 Jun, 2021 09:15 IST|Sakshi

రేటింగ్‌ దిగ్గజం ఎస్‌అండ్‌పీ

మూడవ వేవ్‌ హెచ్చరికలు

వృద్ధి రేటు అంచనాకు ఒకటిన్నర శాతం కోత

11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింపు  

న్యూఢిల్లీ: మహమ్మారి తదుపరి వేవ్‌ల నుంచి భారత్‌ ఎకానమీకి ఇబ్బంది పొంచి ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవుట్‌లుక్‌ అనిశ్చితిలో ఉందని హెచ్చరించింది.

 2021–22 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తొలి (మార్చినాటి) అంచనాల 11 శాతాన్ని తాజాగా 9.5 శాతానికి తగ్గించింది. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్‌ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాలెన్స్‌ షీట్స్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం వచ్చే రెండేళ్లలో కనబడుతుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతానికి పరిమితం అవుతుంది.   వ్యాక్సినేషన్‌ నత్తనడక నడుస్తుండడం ప్రతికూలాంశం. మొత్తం ప్రజల్లో కేవలం 15 శాతం మం దికి మాత్రమే ఇప్పటి వరకూ తొలి విడత వ్యాక్సినేషన్‌ జరిగింది. అయితే ఇకపై వ్యాక్సినేషన్‌ మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నాం.   మొదటివేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో తయారీ, ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినకపోయినప్పటికీ, సేవల రంగం మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. వాహన విక్రయాల వంటి కీలక వినియోగ సూచీలు 2021 మేలో తీవ్రంగా పడిపోయాయి. వినియోగ విశ్వాసం తీవ్రంగా దెబ్బతింది.  

కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆంక్షలు, లాక్‌డౌన్‌ నిబంధనలు తగ్గుతున్నాయి. రవాణా మెరుగుపడుతోంది. అయితే రికవరీ 2021 తొలి మూడు నెలల నాటి స్థాయిలో  వేగంగా ఉండకపోవచ్చు.  కుటుంబాల పొదుపు రేట్లు పడిపోతున్నాయి. దీనితో వినియోగానికి మద్దతు లభించడంలేదు. ఒకవేళ ఉన్న కొద్దోగొప్పో డబ్బును కుటుంబాలు పొదుపుచేసుకోవడం మొదలుపెడితే, ఎకానమీ పునఃప్రారంభమైనా కుటుంబాల పరంగా వ్యయాలు అంతగా వేగం పుంజుకోకపోచ్చు.    ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాలు తగిన సరళతరంగానే కొనసాగవచ్చు. అయితే ఇప్పట్లో తాజా ఉద్దీపన ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు.  

రిటైల్‌ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (2–6 శ్రేణి)  కన్నా అధికంగా ఆరు శాతంపైగా కొనసాగుతున్న పరిస్థితుల్లో సెంట్రల్‌ బ్యాంక్‌ మరో దఫా రెపో రేటు కోతకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) అవకాశం లేదు. దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ద్రవ్య విధానం విషయంలో ప్రభుత్వానికి పరిమితులున్నాయి. ఇందులో మొదటిది సెకండ్‌ వేవ్‌ రావడానికి ముందే– ఫిబ్రవరి 1వ తేదీన  2021–22 బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి.  భారత్‌ ఎకానమీ వృద్ధి రేటు 2021–22లో రెండంకెలపైనే ఉంటుందని సెకండ్‌వేవ్‌కు ముందు పలు విశ్లేషణా సంస్థలు అంచనావేశాయి. అయితే తరువాత కాలంలో ఈ రేటును ఒకంకెలోపునకు తగ్గించేశాయి. స్వయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఈ నెల ప్రారంభంలో వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది.

మరిన్ని వార్తలు