ఫాంగ్‌ స్టాక్స్‌ దన్ను- మూడో రోజూ రికార్డ్స్‌

26 Aug, 2020 09:24 IST|Sakshi

సరికొత్త గరిష్టాలకు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌

బోయింగ్‌, యాపిల్‌ డీలా- డోజోన్స్‌ డౌన్‌

ఉద్యోగాల కోత- అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ పతనం

పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ బెస్ట్‌ బయ్‌ బోర్లా

వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు రికార్డులను నెలకొల్పాయి. ఎస్‌అండ్‌పీ 13 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,444 వద్ద నిలవగా..  నాస్‌డాక్‌ 87 పాయింట్లు(0.76 శాతం) ఎగసి 11,466 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్‌ మాత్రం 60 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,249 వద్ద స్థిరపడింది. ఫాంగ్‌ స్టాక్స్‌ మరోసారి లాభపడటంతో నాస్‌డాక్‌ 2020లో 38వ సారి సరికొత్త రికార్డును సాధించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గురువారం జాక్సన్‌హోల్‌ వద్ద ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టిపెట్టినట్లు తెలియజేశారు. 

యాపిల్‌ డీలా
షేర్ల విభజన తదుపరి డోజోన్స్‌లో యాపిల్‌ ఇంక్‌ వెయిటేజీ నీరసించగా.. ఇండెక్స్‌లో చేపట్టిన ఇతర మార్పులు ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డోజోన్స్‌లో ఎక్సాన్‌ మొబిల్‌ స్థానే సేల్స్‌ఫోర్స్‌.కామ్‌కు చోటు లభిస్తుండగా.. హనీవెల్‌  ఇంటర్నేషనల్‌ రాకతో రేథియాన్‌ టెక్నాలజీస్‌ చోటు కోల్పోనుంది. ఈ బాటలో ఫైజర్‌ ఇంక్‌ను తోసిరాజని యామ్జెన్‌ ఇంక్‌ డోజోన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. బోయింగ్ ఇంక్‌ 2 శాతం, యాపిల్‌ 1 శాతం చొప్పున క్షీణించడంతో డోజోన్స్‌ వెనకడుగు వేసింది. అయితే ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ 3-1 శాతం మధ్య లాభపడటంతో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ రికార్డులు కొనసాగినట్లు నిపుణులు పేర్కొన్నారు.

బెస్ట్‌ బయ్‌ వీక్‌
ప్రభుత్వం పేరోల్ ప్యాకేజీని పొడిగించకుంటే అక్టోబర్‌లో 19,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించడంతో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ కౌంటర్‌ 2.2 శాతం డీలా పడింది. ఎలక్ట్రానిక్స్‌ చైన్‌ బెస్ట్‌ బయ్‌ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా క్యూ3లో అమ్మకాలు క్షీణించవచ్చని అంచనా వేసింది. దీంతో ఈ షేరు 4 శాతం పతనమైంది. ఇక క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించడంతో మెడ్‌ట్రానిక్స్‌ షేరు 2.5 శాతం ఎగసింది.

మరిన్ని వార్తలు