Space Tourism: అంతరిక్ష యాత్రకు ఛలో ఛలో.. అది కూడా ఓ బెలూన్‌లో!

14 Aug, 2022 15:06 IST|Sakshi

Space Tourism: బెలూన్‌లో విలాసంగా విహరించాలని ఉందా? అలాగైతే, ఈ ఫొటోలో కనిపిస్తున్నదే అందుకు సరైన బెలూన్‌. అలా పైకెగిరి, నాలుగు చక్కర్లు కొట్టేసి నేలకు దిగిపోయే ఆషామాషీ బెలూన్‌ కాదిది. సరిగా చెప్పాలంటే, ఇదొక కొత్తతరహా వ్యోమనౌక. స్పేస్‌టూరిజంలో ఇదొక కొత్త ప్రయోగం. ఇందులో కులాసాగా కూర్చుంటే, అంతరిక్షం అంచుల వరకు వెళ్లవచ్చు. నేల మీద నుంచి ఏకంగా లక్ష అడుగుల పైకి వెళ్లి, అక్కడి నుంచి బంతిలా కనిపించే భూగోళాన్ని కళ్లారా తిలకించవచ్చు.

ఇదొక్కటే ఇందులోని విశేషం కాదు. ఇందులో స్టార్‌ హోటళ్లలో ఉండే సమస్త విలాసాలూ సౌకర్యాలూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ విలాసాల వ్యోమనౌక పేరు ‘స్పేస్‌షిప్‌ నెప్ట్యూన్‌’. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ స్పేస్‌ టూరిజం సంస్థ ‘స్పేస్‌ పెర్‌స్పెక్టివ్‌’ 2024లో దీని ద్వారా పర్యాటకులను అంతరిక్ష యాత్రకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రపంచంలోనే తొలిసారిగా పర్యాటకులకు విలాసవంతమైన అంతరిక్ష యాత్రానుభూతి కల్పించనున్నామని ఈ కంపెనీ చెప్పుకుంటోంది. 

‘స్పేస్‌క్రాఫ్ట్‌ నెప్ట్యూన్‌’ విస్తీర్ణంలో పూర్తిగా ఒక ఫుట్‌బాల్‌ మైదానమంత ఉంటుంది. దీని పొడవు ఏడువందల అడుగులు కాగా, పూర్తిగా విస్తరిస్తే, దీని ఘన పరిమాణం 1.8 కోట్ల ఘనపుటడుగులు ఉంటుంది. దీనిలో ప్రయాణిస్తే, 360 డిగ్రీల కోణంలో భూగోళాన్ని పూర్తిగా తిలకించవచ్చునని కంపెనీ వర్గాల సమాచారం. ఇందులో ప్రయాణించాలంటే, 1.25 లక్షల డాలర్లు (రూ.99.61 లక్షలు) చెల్లించి, సీటును బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

చదవండి: Scam 1992: '1992 స్కాం' వెబ్‌ సిరీస్‌లో రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా క్యారక్టర్‌ ఎవరిదో తెలుసా?

మరిన్ని వార్తలు