ఇంటి పనిలో భర్తలు సహకరించడం లేదా? యాప్‌ను లాంచ్‌ చేసిన ప్రభుత్వం!

23 May, 2023 19:57 IST|Sakshi

లంకంత ఇల్లు. ఇంటికి సరిపోయేంత జనం. బండెడు చాకిరీ నవ్వుతు చేస్తున్నాం. సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాం. మేం ఇల్లు, పిల్లలు, ఆఫీస్‌ ఇలా ఊపిరి సలపనంత పనితో సతమతమవుతున్నాం. భర్తలు సైతం ఇంటి పని, వంట పని పిల్లలు స్కూల్‌ బాధ్యతల్ని చూసుకుంటే బాగుంటుంది. కానీ అది కలగానే మిగిలిపోతుందంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. 

ఈ తరుణంలో స్పెయిన్‌ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చూపేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంది. ఇంటి పని, వంట పనిలో భర్త సాయం చేస్తున్నారా? లేదా అని పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది.ఆ యాప్‌ ఇంట్లో భార్యలకు భర్తల సహకారం ఎలా ఉందో గుర్తిస్తుంది. 

జెనీవాలో జరిగిన సమావేశంలో స్పెయిన్ విదేశాంగ కార్యదర్శి నాజీల రోడ్ర్గెజ్ ఉచితంగా ఓ యాప్‌ను ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. ఇంట్లో బాధ్యతల్ని మోసే మహిళల ‘మానసిక భారాన్ని’ పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు ఇంట్లోని ఇతర కుటుంబసభ్యుల సహకారం అవసరం. తద్వారా ఇంటి బాధ్యతల్ని సమానంగా పంచుకునేలా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో భార్య, భర్తల్లో ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు? ఎవరు తక్కువ పనిచేస్తున్నారనే విషయాల్ని మేం లాంచ్‌ చేసిన యాప్‌ ఇట్టే కనిపెట్టేస్తుందని అన్నారు.  

అయితే, ఈ యాప్‌తో ముందుకు వచ్చిన స్పెయిన్ నిర్ణయం పట్ల పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి యాప్స్‌ వల్ల ఇంటి పని ఎగ్గొట్టే భర్తలు ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. మొత్తానికి ఈ యాప్‌ ఆలోచన బాగుంది. కానీ ఇంట్లో పనికి సహకరించిన భర్తలపై స్పెయిన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయంపై నాజీల రోడ్‌ర్గెజ్‌ స్పష్టత ఇ‍వ్వలేదు.   

మరిన్ని వార్తలు