అదిరిపోయే గాడ్జెట్‌, ఫోన్‌లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు!

6 Mar, 2022 09:16 IST|Sakshi

సాధారణంగా నలుగురిలో ఫోన్‌ మాట్లాడటం మహా కష్టం. అదీ ఆఫీసుల్లో, ప్రయాణాల్లో ఇంకా కష్టం. మనం మాట్లాడితే పక్కవారు మన రహస్యాలను వింటున్నారా? మాటలను గమనిస్తున్నారా? ఇలా ఎన్నో భయాలతో.. ఫోన్‌లో అవతల వ్యక్తికి చెప్పాలనుకున్నది చెప్పలేం. మరోవైపు మన ఫోన్‌ సంభాషణలతో పక్కవాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమోననే భయం కొన్నిసార్లు ముఖ్యమైన ఫోన్‌కాల్స్‌ను కూడా మాట్లాడనివ్వదు. 

పోనీ ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని మాట్లాడదామంటే.. అవతల వ్యక్తికి మన మాట సరిగా వినిపించకపోవడమో, చెవుల్లో ఇయర్‌ ఫోన్స్‌ ఉండటంతో.. మనమెంత బేస్‌లో మాట్లాడుతున్నామో మనకు తెలియకపోవడమో ఇలా చాలా సమస్యలు ఉంటాయి. దాంతో ఏదైనా రహస్యం చెప్పాలంటే.. తర్వాత చెబుతానులే అనేస్తాం. మాట దాటేస్తాం. అలాంటి సమస్యకు చెక్‌ పెడుతోంది ఈ ఉష్‌మీ హెడ్‌ ఫోన్స్‌. 

చక్కగా వందమందిలో ఉన్నా రహస్యాలను ఆపాల్సిన పనిలేకుండా చేస్తుంది ఈ డివైజ్‌. దీన్ని మెడలో వేసుకుని, సంబంధిత యాప్‌ స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. ఫోన్‌ రాగానే దాని ఇయర్‌ ఫోన్స్‌ చెవిలో పెట్టుకుని.. మెయిన్‌ బోర్డ్‌ డివైజ్‌ని పెదవులకు దగ్గరగా బిగించుకోవాలి. దీంట్లో సైజ్‌ అడ్జస్టబుల్‌ సిస్టమ్‌ ఉంది. ఔటర్‌ స్పీకర్స్, మినీ జాక్, ఎయిర్‌ ఛానల్, మైక్రోఫోన్‌ ఇలా హై టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్‌ ఎంత గట్టిగా మాట్లాడినా మన వాయిస్‌ని క్యాప్చర్‌ చేసి.. బయటికి అస్సలు వినిపించనివ్వకుండా ఫోన్‌లో అవతల వ్యక్తికి మాత్రం స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.

 స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌తో లైబ్రరీ మాస్కింగ్‌ సౌండ్‌లను ఎంచుకోవడానికీ, వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికీ వీలుంటుంది. బయటి నుంచి వచ్చే శబ్దాలను ఇది చాలా సులభంగా నివారిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా క్యాప్చర్‌ అయినా వాటిని తగ్గించి మన మాటను మాత్రమే అవతలవారికి వినిపించేలా చేస్తుంది. ఆప్షన్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

మరిన్ని వార్తలు