ఆకాశమే హద్దుగా..

1 Jan, 2021 03:44 IST|Sakshi

2021లోనూ అదే జోరు 

కొనసాగనున్న బుల్‌ రన్‌ 

మరింత పైకి పసిడి 

నిపుణుల అంచనాలు

కరోనా వైరస్‌ దెబ్బతో 2020లో ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా కుదేలైన దేశీ మార్కెట్లు.. ఆ తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా ఎగిశాయి. ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకునేందుకు ఆపసోపాలు పడుతున్నా.. స్టాక్స్‌ మొదలుకుని బంగారం దాకా అన్నీ కొంగొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ అదే జోరు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో 2021లో మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలతో పాటు ఆకర్షణీయమైన స్టాక్‌లు, పసిడి పరుగులపై నెలకొన్న అంచనాలపై  కథనం...

కరెక్షన్లు ఉన్నా.. మార్కెట్లు ముందుకే..
కొత్త సంవత్సరంలోనూ బుల్‌ పరుగు కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యమధ్యలో కొంత కరెక్షన్‌ వచ్చినా.. మొత్తం మీద మార్కెట్లు మరింతగా పెరగడం ఖాయమని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే 2021 డిసెంబర్‌ నాటికి నిఫ్టీ 15,000 మార్కును దాటగలదని జేపీ మోర్గాన్‌ వర్గాలు తెలిపాయి. ఇక వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరమని నొమురా అభిప్రాయపడింది. మార్కెట్లు బుల్‌ రన్‌లోనే ఉన్నాయని, మూడేళ్ల కన్సాలిడేషన్‌ బ్రేకవుట్‌ను బట్టి చూస్తే 2021లో 16,200 టార్గెట్‌ సాధించవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది.  

పడితే కొనుగోళ్లకు అవకాశం.. 
సాధారణంగా బుల్‌ పరుగులో 15–20 శాతం కరెక్షన్‌కు అవకాశాలు లేకపోలేదని, అయితే దీన్ని ప్రతికూలాంశంగా భావించాల్సిన పని లేదని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. 11,400 కీలక మద్దతుగా .. ఈ కరెక్షన్లను కొనుగోళ్లకు అవకాశాలుగా మల్చుకోవచ్చని తెలిపింది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా చూస్తే.. అమెరికా ఎన్నికలు జరిగిన మరుసటి సంవత్సరం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు సానుకూల రాబడులే అందిస్తూ వస్తున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తన నివేదికలో వివరించింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, రంగాలవారీగా చూస్తే ఫైనాన్షియల్స్, టెలికం రంగాలపై దృష్టి పెట్టొచ్చని సిటీ రీసెర్చ్‌ సూచిస్తోంది. ఇక ఆర్డర్లు భారీగా ఉండటం, ప్రాజెక్టుల అమలు మెరుగుపడుతుండటం తదితర అంశాల కారణంగా నూతన సంవత్సరంలో ఇన్‌ఫ్రా రంగం ఆశావహంగా ఉండగలదని యస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. కాస్త రిస్కులు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్స్, టెలికం రంగాలవైపు చూడొచ్చని సిటీ రీసెర్చ్‌ సూచిస్తోంది. గణనీయంగా పడిపోయిన ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ), విద్యుత్, రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థల షేర్లను పరిశీలించవచ్చన్నది శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ సూచన. 

అనిశ్చితిలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటోంది. తాజాగా కరోనా వైరస్‌ సంక్షోభ కాలంలోనూ అది రుజువైంది. 2020 తొలినాళ్లలో దేశీయంగా పుత్తడి గ్రాముల రేటు రూ. 39,100 దగ్గర, అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 1,517 డాలర్ల దగ్గర ప్రారంభమైంది. కరోనా వైరస్‌ పరిణామాలతో ప్రారంభంలో రూ. 38,400 రేటుకు పడిపోయినా ఆ తర్వాత ఒక్కసారిగా ఎగిసింది. మల్టీ కమోడిటీ  ఎక్సే్చంజీ (ఎంసీఎక్స్‌)లో ధర రూ. 56,191 స్థాయిని, అంతర్జాతీయంగా ఔన్సు రేటు (31.1 గ్రాములు) 2,075 డాలర్ల రికార్డు స్థాయిలను తాకింది. కొత్త సంవత్సరంలోనూ పసిడి జోరు కొనసాగే అవకాశాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయంగా రికవరీ మందకొడిగా సాగుతున్నందున కొత్త సంవత్సరంలో ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ. 57,000 నుంచి రూ. 63,000 దాకా చేరొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ తెలిపారు.

ప్యాకేజీ, డాలర్‌ బలహీనత ఊతం.. 
అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్‌ బలహీనతల ఊతంతో బంగారం రేట్లు మరోసారి పెరగవచ్చని కామ్‌ట్రెండ్జ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సరీ్వసెస్‌ సీఈవో జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ తెలిపారు. ‘‘భారత్, చైనాలో పసిడికి డిమాండ్‌ బాగా పెరగవచ్చు. రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా ఉంటే 2021లో పుత్తడి రేటు దేశీయంగా రూ. 60,000, అంతర్జాతీయంగా 2,200 డాలర్లు తాకొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పసిడి రేట్లకు కొనుగోలుదారులు అలవాటుపడుతుండటం, పేరుకుపోయిన డిమాండ్, తక్కువ వడ్డీ రేట్లు, అసాధారణ స్థాయిలో నిధుల ప్రవాహం మొదలైన అంశాలన్నీ బంగారం రేట్లు పెరగడానికి దోహదపడగలవని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్‌ తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌
కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు గతంలో ఎన్నడూ చూడని అసాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పరిశ్రమవర్గాలతో సమాలోచనల సందర్భంగా ఔషధాలు, బయోటెక్నాలజీ, వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రస్తుతం భారీగా ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందంటూ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగాలకు ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. మరోవైపు, 2021 బడ్జెట్‌.. ఇన్వెస్టర్లకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం నిధుల కోసం నానా తంటాలు పడుతోందని.. గతేడాది కార్పొరేట్‌ ట్యాక్స్‌లు తగ్గించినప్పటికీ..కొత్తగా కోవిడ్‌–19 సర్‌చార్జీలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 

టీకాల నుంచి ద్రవ్యోల్బణం దాకా... 
కొత్త సంవత్సరంలో మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు

కార్పొరేట్ల ఫలితాలు
కంపెనీల ఆదాయాలు ఏడాది వ్యవధిలోనే దాదాపు కరోనా పూర్వ స్థాయికి చేరగలవని ఈక్విటీల నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ల ఆదాయాల అంచనాల వృద్ధి 6, 8 శాతం పైగా ఉండొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. మెటల్స్, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పటికే మెరుగైన రాబడులు అందిస్తుండగా.. రిటైల్, ఆటో మొదలైనవి కూడా అదే బాటలో ఉన్నాయని పేర్కొంది.

ఆర్థిక రికవరీ
కరోనా దెబ్బతో  ఎకానమీ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా క్షీణించింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షల ఎత్తివేతతో క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటుతున్నాయి. ఐఎంఎఫ్‌ లెక్కల ప్రకారం భారత ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.3 శాతం క్షీణించే అవకాశమున్నా, వచ్చే ఆర్థిక సంవత్సరం 8.8 శాతం స్థాయిలో వృద్ధి సాధించవచ్చు. 

కోవిడ్‌–19 వ్యాప్తి ట్రెండ్, టీకాలు
కరోనా వైరస్‌ టీకాల సమర్థత, వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం నూతన సంవత్సరంలో అన్నింటికన్నా కీలకంగా ఉండనున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో టీకాలు వేస్తుండగా.. భారత్‌లోనూ జనవరిలో దీన్ని చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫైజర్‌–బయోఎన్‌టెక్, ఆక్స్‌ఫర్డ్‌–ఆ్రస్టాజెనెకా, భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్‌ టీకాలపై అందరి దృష్టి ఉంది. ఇక సెకండ్‌ వేవ్‌ కట్టడీ కీలక అంశమే కావడం గమనార్హం. 

ఆర్‌బీఐ పాలసీ రేట్లు
అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నొమురా అంచనాల ప్రకారం భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. ఇది ఇప్పుడప్పుడే దిగి వచ్చేలా కనిపించడం లేదు. కాబట్టి 2021 మొత్తం మీద రిజర్వ్‌ బ్యాంక్‌ .. వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా మధ్యకాలికంగా చూస్తే ద్రవ్యోల్బణం ఎగియవచ్చని, 2022లో ఆర్‌బీఐ మళ్లీ వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టాల్సి రావొచ్చని నొమురా భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కాస్త దిగి వచ్చినా .. కమోడిటీల రేట్లకు రెక్కలు రావడం, అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడం తదితర అంశాల కారణంగా ఇతరత్రా ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా. 

ఇవే కాకుండా అమెరికాలో కరోనా వైరస్‌పరమైన ఆర్థిక ప్యాకేజీ, బ్రెగ్జిట్, అమెరికా–చైనా మధ్య సంబంధాలు, ఇతరత్రా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనవి మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు