మీ అడుగులు ఎటువైపు..

4 Jan, 2021 04:32 IST|Sakshi

2021లో ఈక్విటీయా లేక డెట్‌ విభాగమా!

ఈక్విటీల్లోనూ అన్నీ ర్యాలీ చేయకపోవచ్చు  

బంగారంలో ర్యాలీ మిగిలి ఉందా?

పెట్టుబడులకు అనుకూల వేదికలు ఏవి?

ఇళ్ల కొనుగోలుకు అనుకూల సమయం..

సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎన్నో పాఠాలు నేర్పిన సంవత్సరం.. 2020. ఒక మహమ్మారి (కోవిడ్‌–19) వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలను కుదిపేసింది. పెట్టుబడులపై దీని ప్రభావం గణనీయంగానే పడింది. ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకుని.. భవిష్యత్తు పరిస్థితులపై ఒక అంచనాతో 2021 సంవత్సరానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారా..? పెట్టుబడుల విషయంలో ఏ విభాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఫండ్‌ మేనేజర్ల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం.

ఈక్విటీలు
రంగాలు..
ప్రస్తుతానికి అయితే అన్ని రకాల స్టాక్స్‌ ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని రంగాల్లో డిమాండ్‌ బలంగానే ఉంది. వ్యయ నియంత్రణలు, ఆస్తుల నాణ్యత పరంగా మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. మహమ్మారిని నియంత్రించడం ఆలస్యమైనా లేదా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో కొనసాగకపోయినా రంగాల వారీగా ర్యాలీ కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావొచ్చు. జీడీపీ వృద్ధి తీరుపైనే మార్కెట్‌ రాబడులు ఆధారపడి ఉంటాయి. 2–5 ఏళ్ల కాల దృష్టితో ఇన్వెస్టర్లు పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి.  
– శ్రేయాష్‌ దేవల్కర్, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్, యాక్సిస్‌ ఏఎమ్‌సీ

మిడ్, స్మాల్‌క్యాప్‌
మార్చి, జూన్‌ త్రైమాసికాలపై లాక్‌డౌన్‌ ప్రభావం చూపించగా.. ఆదాయాల పరంగా మిడ్, స్మాల్‌క్యాప్‌ కంపెనీలు 2020 సెప్టెంబర్‌ నాటికి మంచి రికవరీని చూపించాయి. అంతర్జాతీయంగా వెల్లువలా ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా స్టాక్స్‌ ధరలను గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఎర్నింగ్స్‌ రికవరీ ఆలస్యమవుతుందన్న అంచనాలతో మిడ్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో.. ఇప్పటికీ బ్యాంకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, రిటైల్‌ స్టాక్స్‌ పనితీరు నిరుత్సాహకరంగానే ఉంది. కొన్ని రంగాల/స్టాక్స్‌ విలువలు చాలా ఎక్కువలోనే ఉన్నాయి. కనుక అధిక ఆశావాదంతో కాకుండా బలహీన కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ విలువలు చూడ్డానికి అధికంగా ఉన్నాయి. కానీ, అవి తక్కువ ఆర్జనా సైకిల్‌లో (కాలంలో) ఉన్నాయి. ఆదాయాల్లో రికవరీ మొదలైతే ఇవి మంచి రాబడులను ఇవ్వగలవు. అధిక వ్యాల్యూషన్ల దృష్ట్యా ఏడాది కోసం అయితే స్మాల్, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయవద్దనే సూచిస్తున్నాము. ప్రస్తుతం చూస్తున్న అనిశ్చిత పరిస్థితుల్లో 2021 సంవత్సరానికి ప్రత్యేకంగా ఏ అంచనాలు ఇవ్వడం వివేకమని భావించడం లేదు. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు ఈ విభాగంలోని స్టాక్స్‌లో పెట్టుబడుల వైపు చూడొచ్చు.

ఏ స్టాక్స్‌..  
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్‌ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్‌ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్‌ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్‌ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము.  
– వినిత్‌ సంబ్రే, హెడ్‌ (ఈక్విటీస్‌), డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌

డెట్‌
వడ్డీ రేట్లు..!
రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా ఉండడం, ఆర్‌బీఐ చర్యల కారణంగా విస్తారమైన నిధుల అందుబాటు నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు లిక్విడిటీ మిగులుగానే ఉంటుంది. బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ అనుకూలతల దృష్ట్యా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి (ఐదేళ్ల వరకు) ఈల్డ్‌ కర్వ్‌ అధికంగానే ఉండొచ్చు. పాలసీ సర్దుబాట్లు క్రమంగా ఉండొచ్చు. ఈల్డ్‌ కర్వ్‌ చాలా నిటారుగా ఉంది. ఈ పరిస్థితుల
దృష్ట్యామూడేళ్ల కంటే ఎక్కువ కాల దృష్టితో ఎవరైనా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అస్థిరతలకు
సన్నద్ధంగానూ ఉండాలి.
– అనురాగ్‌ మిట్టల్, ఐడీఎఫ్‌సీ ఫండ్‌

ఏ స్టాక్స్‌..  
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్‌ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్‌ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్‌ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్‌ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము.  
– వినిత్‌ సంబ్రే, హెడ్‌ (ఈక్విటీస్‌), డీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్‌

ఏవి మెరుగు?
ఇన్వెస్టర్లు తమ కాల వ్యవధి, రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులను మూడు బకెట్లుగా వర్గీకరించుకోవాలి. లిక్విడిటీ బకెట్‌ను స్వల్ప కాల అవసరాల కోసం కేటాయించుకోవాలి. కోర్‌ బకెట్‌ అధిక నాణ్యతతో కూడిన క్రెడిట్‌ లేదా డ్యురేషన్‌ ఫండ్స్‌తో ఉండాలి. స్థిరమైన రాబడులను అందించే విధంగా ఎంపిక ఉండాలి. ఇందుకోసం అల్ట్రాషార్ట్, మీడియం టర్మ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇక శాటిలైట్‌ బకెట్‌ అన్నది దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించినది. మూడేళ్లకు పైన కాలానికి కేటాయింపులు చేసుకునే వారికి ఇది అనుకూలం. కొంత అస్థిరతలను తట్టుకునే విధంగా ఉండాలి. అయితే స్థూల ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో, క్రెడిట్‌ స్ప్రెడ్స్‌ కుచించుకుపోయిన దృష్ట్యా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ అన్నవి రిస్క్‌కు తగ్గ రాబడులు ఇవ్వవని మా అభిప్రాయం.  
పసిడి
లార్జ్‌క్యాప్‌..
ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య, పరపతి విధానాలు సులభంగా మారడం కారణంగా వచ్చిన స్టాక్స్‌ ర్యాలీ ఇది. అధిక ఫ్రీ క్యాష్‌ ఫ్లో (వ్యాపారంలో నగదు లభ్యత), తక్కువ రుణ భారం, అధిక ఆర్‌వోఈ (ఈక్విటీపై రాబడి) ఉన్న కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. గడిచిన రెండు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే.. పండుగుల సీజన్‌తో ధరల పరంగా కంపెనీలకు స్వేచ్ఛ (ప్రైసింగ్‌ పవర్‌) తిరిగి లభించింది. డిమాండ్‌ ఎక్కువగా ఉండడానికి తోడు, ఇప్పటికీ కొన్ని రంగాల్లో సరఫరా పరంగా సమస్యలు ఇందుకు కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా 2021లో ఈ డిమాండ్‌ నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైనది. తక్కువ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు కొనసాగడం అనేది రియల్‌ ఎస్టేట్, ఆటోమొబైల్‌ వంటి రంగాల్లో దీర్ఘకాలిక రికవరీకి కీలకం అవుతుంది. చాలా కంపెనీల వ్యాల్యూషన్లు అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్లలో పురోగతి, తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన రాబడులకు దారితీయగలవు.

ర్యాలీ ముగిసినట్లేనా?
కరోనా వ్యాక్సిన్ల తయారీలో పురోగతితో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశావహ ధోరణి ఏర్పడింది. దీంతో రిస్కీ సాధనాలకు (ఈక్విటీ తదితర) డిమాండ్‌ ఏర్పడడంతో బంగారం ర్యాలీ గత కొన్ని వారాలుగా నిలిచింది. అయితే, సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్లను ఇవ్వడం ఆరంభించినా కూడా.. గడిచిన కొన్ని నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన నష్టం ఒక్క రాత్రితో పోయేది కాదు. పూర్తిగా కోలుకునేందుకు ఐదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు మరో విడత పెరిగిపోవడంతో ఆర్థిక రికవరీ బలహీనపడనుంది. మరికొన్ని నెలల పాటు ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయి. బంగారం ధరల్లో అప్‌మూవ్‌ కరోనాకు ముందే మొదలైంది. కాకపోతే అద్భుత ర్యాలీకి కారణాల్లో కరోనా వైరస్‌ కూడా ఒకటి. బంగారం ధరలకు మద్దతుగా నిలిచిన స్థూల ఆర్థిక పరిస్థితులే 2021లోనూ కొనసాగనున్నాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య ప్రపంచంలో కనిష్ట వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము. కనుక యూఎస్‌ ట్రెజరీల్లో కంటే బంగారంలో పెట్టుబడులను కలిగి ఉండడమే మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. అనూహ్యమైన లిక్విడిటీతో ద్రవ్యోల్బణం రిస్క్‌ ఉండనే ఉంది. ఇది కూడా బంగారానికి మద్దతుగా నిలిచే అంశమే. 

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు..
భారత్‌లో బంగారంపై పెట్టుబడుల విషయంలో ఈటీఎఫ్‌ల వాటా గతంలో 10 శాతంగా ఉంటే, 2020లో 25 శాతానికి చేరుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా భౌతికంగా బంగారం కొనుగోలుకు అననుకూలతలు ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే, డిజిటైజేషన్, బంగారంలో స్వచ్ఛత, ధరలు, సౌకర్యం కూడా ఇన్వెస్టర్లను ఈటీఎఫ్‌లకు దగ్గర చేస్తోంది. కనుక ఈటీఎఫ్‌లకు ఆదరణ కొనసాగుతుంది. బంగారం అన్నది రిస్క్‌ను తగ్గించి, పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్నిచ్చే సాధనం. మీ పెట్టుబడుల్లో 10–15 శాతం మేర బంగారానికి ఇప్పటికీ కేటాయించనట్టయితే.. అందుకు ఇది సరైన తరుణం అవుతుంది. తక్కువ ధరల నుంచి ప్రయోజనం పొందొచ్చు.
– చిరాగ్‌ మెహతా, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్, క్వాంటమ్‌ ఏఎమ్‌సీ  

 రియల్టీ
ఇళ్లకు డిమాండ్‌
2020 ద్వితీయ ఆరు నెలల్లో (జూలై నుంచి) నివాస గృహాలకు బలమైన డిమాండ్‌ నెలకొంది. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖా తీసుకున్న చర్యలు కొనుగోలు దిశగా నిర్ణయానికి దారితీశాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో గృహాల ధరలు చాలా మార్కెట్లలో స్థిరంగా ఉండిపోవడం, కొన్ని చోట్ల దిద్దుబాటుకు (తగ్గడం) గురి కావడం చూశాము. దీంతో అవి అందుబాటు ధరలకు వచ్చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల డిమాండ్‌ పుంజుకుంది.  

కొత్త ఏడాది!
ఇతర పెట్టుబడి సాధనాల పనితీరు, బడ్జెట్లో ప్రకటనలు, కేంద్రం అందించే రాయితీలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇవన్నీ
డిమాండ్‌ను నిర్ణయించేవే. ఆర్థిక వృద్ధిలో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లు అంత త్వరగా అంతం
కావు.  

వాణిజ్య రియల్టీ
అంతర్జాతీయ, దేశీయ ఐటీ, టెక్నాలజీ రంగంలో క్రమబద్ధమైన వృద్ధి, కార్పొరేట్ల విస్తరణ కారణంగా.. ఆఫీసు స్థలాలకు వృద్ధి కొనసాగుతూనే ఉంది. కీలకమైన వాణిజ్య మార్కెట్లలో ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలో లావాదేవీల్లో వృద్ధి నెలకొనడమే కాకుండా, సాధారణ స్థితి ఏర్పడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నందున ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నాము.  
– శిశిర్‌ బైజాల్, చైర్మన్, ఎండీ, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా  

మరిన్ని వార్తలు