బంగారం: ఈ తరహా పెట్టుబడులు బెస్ట్‌!

24 Oct, 2022 08:42 IST|Sakshi

ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాలు మొదలైన ప్రతికూల పరిణామాలు నెలకొన్నప్పటికీ 2022లో పసిడి ఇన్వెస్టర్లకు అంతగా కలిసి రాలేదు. అయినప్పటికీ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా పసిడి రేట్ల తీరుతెన్నులు చూస్తే.. బంగారం ధరలు 2021లో 4 శాతం మేర తగ్గాయి. ఒక దశలో రూ. 43,320కి (పది గ్రాములు) పడిపోయాయి.

అక్కణ్నుంచి సుమారు 28 శాతం ర్యాలీ చేసి 2022 మార్చిలో రూ. 55,558కి చేరాయి. దీన్ని బట్టి చూస్తే బంగారానికి దీర్ఘకాలిక ట్రెండ్‌ ఇంకా సానుకూలంగానే ఉంది. సాంకేతికంగా గత ఆర్థిక సంవత్సరంలో బంగారం ఆల్‌ టైమ్‌ గరిష్టమైన రూ. 56,191–ఇటీవలి కనిష్టమైన రూ. 43,320 స్థాయుల మధ్య తిరుగాడింది. ప్రస్తుతం సుమారు రూ. 51,000 స్థాయిలో ఉన్న పసిడి వచ్చే ఏడాది దీపావళి నాటికి రూ. 56,000కు చేరుకోవచ్చు. కాబట్టి తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా కొనుగోలు చేయొచ్చు. టెక్నికల్‌గా చూస్తే రూ. 46,000–46,300 మద్దతుగా ఉంటుంది. దాన్ని కోల్పోతే రూ. 41,000కు తగ్గవచ్చు. మరోవైపు, రూ. 55,200–56,100 నిరోధ స్థాయిగా ఉండొచ్చు. దాన్ని దాటేస్తే రూ. 61,500 అటుపైన రూ. 66,000 వద్ద గట్టి నిరోధం ఎదురుకావచ్చు.

చదవండి: ముదురుతున్న మూన్‌లైటింగ్‌.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది!

మరిన్ని వార్తలు