మొబైల్ టారిఫ్‌లు పెరగనున్నాయా?

5 Mar, 2021 18:57 IST|Sakshi

దాదాపు ఐదేళ్ల తర్వాత నిర్వహించిన 2021 స్పెక్ట్రమ్​ వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ స్పెక్ట్రమ్​ వేలంలో జియో అతిపెద్ద బిడ్డర్‌గా అవతరించింది. ఈ వేలంలో విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో మూడింట రెండు వంతుల వాటా కొనుగోలు చేసింది. ఆయా నెట్​వర్క్​లు ఎంత మేర స్పెక్ట్రమ్​ను కొనుగోలు చేశాయి? దాని కోసం ఎంత చెల్లించారు? వంటి విషయాలు వినియోగదారుల మొబైల్ టారిప్‌లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. దీని ప్రభావం ప్రీపెయిడ్ కస్టమర్‌కు అందించే ఆఫర్‌ల మీద కూడా పడనుంది.

భారత ప్రభుత్వం మొత్తం రూ.77,800 కోట్ల విలువైన స్పెక్ట్రంను విక్రయించింది. వీటిలో జియో సుమారు రూ.57,100 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.18,700 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,000 కోట్లు విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఈ స్పెక్ట్రమ్​ వేలం 4జీ బ్యాండ్​ల కోసం నిర్వహించారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్​లో 800 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ రేంజ్​లో స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. అయితే, ఈ స్పెక్ట్రమ్ను 5జీ సేవల కోసం కూడా ఉపయోగించుకోనున్నట్లు పేర్కొన్నాయి.

ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు 2జీ, 3జీ నుంచి 4జీకి మారడాన్ని ఈ స్పెక్ట్రం వేలం మరింత వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం జియోలో కేవలం 4జీ చందాదారులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 2జీ, 3జీ యూజర్లు 4జీకి మారడం వల్ల ఎయిర్​టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు లాభదాయకమే. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న మూడు నెట్​వర్క్​లకు బదులుగా ఒక నెట్‌వర్క్‌ను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే, 2జీ, 3జీ ప్లాన్‌లతో పోలిస్తే 4జీ డేటా ప్లాన్లు నాలుగు రెట్లు ఎక్కువ ఖరీదైనవి. అందువల్ల, 4జీకి మారడం వల్ల వినియోగదారుల ఫోన్ బిల్లుల సగటు వినియోగం పెరుగుతాయి.

ఇది నెట్​వర్క్​ కంపెనీలకు మరింత లాభం చేకూర్చనుంది. ఫిచ్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ సోని ప్రకారం ప్రస్తుతం భారత్​లో 50-55 శాతం మంది ఇంకా 2జీ, 3జీ నెట్​వర్క్​లను వాడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ రెండూ కూడా తమ నెట్‌వర్క్ కవరేజీని మెరుగు పరచడానికి వాటి సామర్థ్యాలను విస్తరించడానికి 2300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్​ను కొనుగోలు చేశాయి. తద్వారా, తమ 4జీ నెట్​వర్క్​ నాణ్యత, సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి.

చదవండి:

జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి!

వాహనదారులకు కేంద్రం శుభవార్త!

>
మరిన్ని వార్తలు