SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!

22 Sep, 2022 10:59 IST|Sakshi

స్పైస్‌జెట్ పైలట్లకు దసరా కానుక

20 శాతం జీతాల పుంపు

సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్‌బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో  కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్‌ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్‌ అరోరా తెలిపారు.

ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా  తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద  80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్‌ కంట్రోల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  భావిస్తు‍న్నారు

మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్‌జెట్‌కు బుధవారం మరో షాక్‌ ఇచ్చింది.  గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్‌లో పేర్కొంది.

విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా  ఈ ఏడాది జూలై 27న స్పైస్‌జెట్‌కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది.    కాగా గురువారం నాటి మార్కెట్‌లోస్పైస్‌జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. 
 

మరిన్ని వార్తలు