SpiceJet: ర్యాన్‌సమ్‌వేర్ ఎటాక్‌, ప్రయాణీకుల గగ్గోలు

25 May, 2022 12:18 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లిమిటెడ్‌కు ఊరట లభించింది.  క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య పెండింగ్‌లో ఉన్న వివాదానికి తెర దించింది. దీంతో బుధవారంనాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్‌ 4 శాతం లాభపడింది. క్రెడిట్ సూయిస్‌తో పాటు, ఇటీవల కెనడా లిమిటెడ్, బోయింగ్, సీడీబీ ఏవియేషన్, బీఓసీ ఏవియేషన్, అవోలాన్‌లతో సెటిల్‌మెంట్లతో  సంస్థ వృద్ధికి,  విస్తరణకు  దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎక్స్ఛేంజ్‌లకిచ్చిన సమాచారం ప్రకారం స్పైస్‌జెట్ లిమిటెడ్, క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య వివాద సెటిల్‌మెంట్, అంగీకారం నిబంధనలపై (మే 23) సంతకాలు ముగిసాయి. తుది ఉత్తర్వుల కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిసింది. ఇందులో భాగంగా  కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించేందుకు పరస్పర అంగీకారం కుదిరిందని స్పైస్‌జెట్ తెలిపింది. 

ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ ఇప్పటికే 5 మిలియన్ల డాలర్ల బ్యాంక్ గ్యారెంటీని అందించిందని, దీనికి సంబంధించి తమపై ఎలాంటి ప్రతికూల ఆర్థిక ప్రభావం ఉండదని  తెలిపింది. స్విస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్‌ ఓవర్‌హాలింగ్ సర్వీస్ ప్రొవైడర్‌ ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌కు 24 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లింపులు చేయడంలో ఎయిర్‌లైన్ విఫలమవడంతో క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్‌పై గత సంవత్సరం మద్రాస్ హైకోర్టులో దావా వేసింది.

స్పైస్‌జెట్ బోయింగ్ 737లు, క్యూ-400లు,ఫ్రైటర్‌ విమానాలను నడుపుతుంది.  రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌  కింద 63 రోజువారీ విమాన సర్వీసులతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ప్రవేశ పెడుతుందని, త్వరలో తమ విమానాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు  సీఎండీ అజయ్ సింగ్ సోమవారం తెలిపారు. 

కాగా కరోనా సంబందిత ప్రయాణ ఆంక్షలు సడలింపులతో దేశీయ విమానయాన ట్రాఫిక్ కోలుకుంటోంది. ఏప్రిల్‌లో దాదాపు 1.08 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు ప్రయాణించారని, మార్చిలో ప్రయాణించిన వారి సంఖ్య 1.06 కోట్లకు పైగా 2 శాతం ఎక్కువ అని భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఇటీవల వెల్లడించింది. ఈ ఏప్రిల్‌లో స్పైస్‌జెట్, ఇండిగో, విస్తారా, గో ఫస్ట్, ఎయిరిండియా,ఎయిర్ ఏషియా ఇండియా ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 85.9 శాతం, 78.7, 82.9,  80.3,  79.5,  79.6 శాతంగా ఉన్నాయన్నారు.

ర్యాన్‌సమ్‌వేర్ ఎటాక్‌, ప్రయాణీకుల గగ్గోలు
స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్‌ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో  బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్‌ వీడియో పోస్ట్‌ చేశారు.

మరోవైపు రాన్‌సమ్‌వేర్ అటాక్‌తో బుధవారం ఉదయం స్పైస్‌జెట్ డిపార్చర్స్‌ ఇబ్బందులు, ప్రయాణికులు చిక్కుకుపోవడంపై అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అటాక్ కారణంగా బుధవారం ఉదయం నాటి విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని ట్విట్‌ చేశారు. ఈ పరిణామాన్ని తమ ఐటీ టీం సరిదిద్దిందని,  విమాన సేవలు సజావుగానే ఉన్నాయంటూ స్పైస్‌జెట్ ట్విట్ చేసింది.

మరిన్ని వార్తలు