SpiceJet Flight: క్యాబిన్‌లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు

14 Oct, 2022 11:40 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్‌లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్‌ కావడంతో ప్రయాణీకులు  ఊపిరి పీల్చుకున్నారు.  (అమెజాన్‌ దివాలీ సేల్‌: శాంసంగ్‌ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు)

గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా  ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్‌ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్‌ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్‌ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా,  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేసినట్టు వెల్లడించాయి.

హైదరాబాద్‌బాద్‌కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్‌ తనకెదురైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్‌. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని,  చాలామంది  ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. 

“వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్‌ చేశారు. ఎమర్జెన్సీ డోర్‌ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు.

కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది.  50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు  పొడిగించింది. 

మరిన్ని వార్తలు