విమాన ప్రయాణికులకు షాక్‌! ఛార్జీల పెంపు షురూ..

16 Jun, 2022 13:41 IST|Sakshi

పెరిగిన ధరలతో సామాన్యులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లకు ఇప్పుడీ కాక మరింత బాగా తాకనుంది. బడ్జెట్‌ ధరల్లో విమాన సర్వీసులు అందించే స్పైస్‌జెట్‌ సంస్థ ఛార్జీలు పెంచుతామంటూ ప్రకటించింది. 

ఇటీవల కాలంలో విమానాల్లో ఉపయోగించే జెట్‌ ఫ్యూయల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క జూన్‌లోనే ఇంధన ధరలు 120 శాతం వరకు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రోజురోజుకి క్షీణిస్తుంది. దీంతో ఏవియేషన్‌ సెక్టార్‌లో లాభాల సంగతి అటుంచి వస్తున్న నష్టాలను అదుపు చేయడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. చివరకు ధరల పెంపు ఒక్కటే మార్గంగా ఏవియేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు డిసైడ్‌ అవుతున్నారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సం‍స్థ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గం లేదని స్పైస్‌జెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ ఇప్పటికే ప్రకటించారు. వివిధ మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ధరలు పెంచినా నష్టాల నుంచి తప్పించుకోవడం కష్టమని.. పన్నులు తగ్గించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కూడా ఆయన కోరారు.

కోవిడ్‌ తర్వాత ప్రయాణాలు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఈ తరుణంలో ధరల పెంపుకు విమానయాన సంస్థలు విముఖంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టమనే భావనలోకి స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సైతం ఉన్నాయి. ఈ ఛార్జీలు పెంపు స్పైస్‌జెట్‌తో మొదలైందని.. రాబోయే రోజుల్లో ఇతర సంస్థల నుంచి ధరల పెంపు ప్రకటనలు వెలువడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 

చదవండి: ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్‌ రిచ్‌ ఇక్కడ!

మరిన్ని వార్తలు