SpiceJet: ఆ ఉద్యోగులకు నిజంగా పండగే!  రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు.. బెనిఫిట్లు మామూలుగా లేవుగా..

24 May, 2023 12:55 IST|Sakshi

దేశీ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ స్పైస్‌జెట్ వార్షికోత్సవం సందర్భంగా తమ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించింది. విమాన పైలట్లకు నెలకు రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష నెలవారీ లాయల్టీ రివార్డు వంటివి ఇందులో ఉన్నాయి. 

గురుగ్రామ్‌కు కేంద్రంగా పనిచేసే స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కెప్టెన్ల నెల జీతాన్ని రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్లకు నెలలో 75 గంటల ఫ్లయింగ్‌ అవర్స్‌ ఉంటాయి. ఈ పెంపుదల 2023 మే 16  నుంచి వర్తిస్తుందని స్పైస్‌ జెట్‌ తెలిపింది. అలాగే ట్రైనర్లు (డీఈ, టీఆర్‌ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా పెంచింది ఈ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ. అంతకుముందు నవంబర్‌లోనూ స్పైస్‌జెట్‌ తమ పైలట్‌ల వేతనాలను పెంచిది. అప్పట్లో కెప్టెన్ల జీతం 80 గంటల ఫ్లయింగ్‌ అవర్స్‌కు గానూ నెలకు రూ. 7 లక్షలు ఉండేది.

రూ.లక్ష లాయల్టీ రివార్డ్‌
అదనంగా ఈ ఎయిర్‌లైన్ సంస్థ తమ కెప్టెన్‌లకు నెలకు రూ.లక్ష వరకు నెలవారీ లాయల్టీ రివార్డ్‌ను ప్రకటించింది. వారి ఉద్యోగ కాలానికి అనుగుణంగా ఇచ్చే ఈ రివార్డ్‌ వారి నెలవారీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు స్పెస్‌జెట్‌ చైర్మన్ అజయ్ సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతూ భవిష్యత్తు మరింత ఉత్తేజకరంగా ఉంటుందని, ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలతో  సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు.

స్పైస్‌జెట్  దేశ, విదేశాల్లో మొత్తం 48  గమ్యస్థానాలకు రోజూ దాదాపు 250 విమానాలను నడుపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్, బోయింగ్ 700, క్యూ400 వంటి అత్యాధునిక విమానాలు ఈ సంస్థకు ఉన్నాయి.

ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్‌ ఇండియా.. పైలట్‌ జీతమెంతో తెలుసా?

మరిన్ని వార్తలు