భారతీయుల దగ్గర ఎన్నివేల టన్నుల బంగారం ఉందో తెలుసా!

17 May, 2022 21:04 IST|Sakshi

ముంబై: అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు హెడ్జింగ్‌ సాధనంగా పసిడికి డిమాండ్‌ పెరగవచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ‘ద్రవ్యోల్బణం 1 శాతం పెరిగితే పుత్తడికి డిమాండ్‌ 2.6 శాతం మేర పెరగవచ్చన్నది మా అంచనా. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆర్థికంగా తలెత్తే ప్రతికూలతలతో పాటు ఈక్విటీ మార్కెట్ల వేల్యుయేషన్లు విపరీత స్థాయిలో ఉండటం, స్టాక్‌ మార్కెట్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇటీవల నష్టపోవడం, డిపాజిట్‌ రేట్లు తక్కువ స్థాయిలో ఉండటం తదితర అంశాల కారణంగా సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా ప్రజలు బంగారం వైపు మళ్లే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. 

అయితే, రేటు అధిక స్థాయిలో ఉండటమనేది పెట్టుబడులపరమైన డిమాండ్‌కు కొంత ప్రతిబంధకం కాగలదని వివరించింది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణ పెరుగుదలకు హెడ్జింగ్‌ సాధనంగా గత కొన్నాళ్లుగా బంగారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. దీర్ఘకాలికంగా చూస్తే గత 15 ఏళ్లలో ఇది ఈక్విటీలు, డెట్‌ సాధనాలకు మించిన రాబడులు అందించినట్లు యూబీఎస్‌ నివేదిక వివరించింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 837 టన్నులుగా ఉండగా .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 750 టన్నులకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా చీఫ్‌ ఎకానమిస్ట్‌ తన్వీ గుప్తా జైన్‌ తెలిపారు. అయినప్పటికీ రేటు ఎక్కువగానే కొనసాగుతుండటం వల్ల విలువపరంగా 34 బిలియన్‌ డాలర్ల స్థాయిలో .. అధికంగానే ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.  

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ)డేటా ప్రకారం భారతీయుల దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా 27,000 టన్నుల పైగా పసిడి ఉంది. దీని విలువ సుమారు 1.675 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం నామినల్‌ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దీని వాటా 53 శాతం. అదే రిటైల్‌ బ్యాంక్‌ డిపాజిట్ల వాటా 46 శాతమే. రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర 48 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పసిడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 33.34 శాతం పెరిగి 46.14 బిలియన్‌ డాలర్లకు (837 టన్నులు) చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 34.62 బిలియన్‌ డాలర్లే.

చదవండి👉గ్రాము సార్వభౌమ బంగారం ధర ఎంతంటే!

మరిన్ని వార్తలు