Qatar Airways CEO Spoof Video: సోషల్‌ మీడియా పైత్యం.. ‘బైకాట్‌ ఖతర్‌ ఎయిర్‌వేస్‌’..

8 Jun, 2022 11:53 IST|Sakshi

స్వియ నియంత్రణ. స్వియ నియంత్రణ అని చెవులు చిల్లలు పడేలా మొత్తుకుంటున్నా సోషల్‌ మీడియాలో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. వాక్‌ స్వాతంత్రం పేరుతో కొందరు ట్రోలింగ్‌ పేరుతో మరికొందరు సున్నితమైన అంశాలపై కూడా ఎడాపెడా కామెంట్లు చేస్తున్నారు. వీడియోలు షేర్‌ చేస్తున్నారు. స్పూఫ్‌లు వండివారుస్తున్నారు. చిత్రంగా ఇలాంటివన్నీ వైరల్‌గా మారిపోతున్నాయ్‌.. అసలైన అంశాలు పక్కదారి పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహారణ హ్యాష్‌టాగ్‌ బైకాట్‌ఖతర్‌ఎయిర్‌వేస్‌ ఉదంతం.

కొందరు బీజేపీ నేతలు ఓ మతంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నాయి. విదేశాల్లో నివసిస్తున్న వలస కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టాయి. కొన్ని దేశాలు ఇప్పటికే భారత ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తుండగా మరికొన్ని దేశాలు క్షమాపణలకు పట్టుబడుతున్నాయి. పార్టీ చేసిన తప్పుకు దేశం తరఫున క్షమాపణలు చెప్పేది ఏంటంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. 

పార్టీ నేతలు చేసిన బాధ్యతారాహిత్య వాఖ్యల వల్ల కలుగున్న నష్టం పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం కిందామీదా అవుతోంది. ఓవైపు దేశ ప్రతిష్టను కాపాడుతూనే విదేశాల్లో ఉన్న భారతీయుల క్షేమం, వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. చాలా సున్నితమైన అంశంలోకి సోషల్‌ మీడియా వేదికగా ఇష్టారీతిగా కామెంట్లు చేస్తున్నారు. వాసుదేవ్‌ అనే  ఓ యువ ట్విటర్‌ యూజర్‌.. ఓ వీడియో చేశాడు. అందులో భారత ఉత్పత్తులపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ... ఖతార్‌ ఎయిర్‌వేస్‌ని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాడు. అతని వాలకం చూస్తే అతనెప్పుడు విమాన్‌ ఎక్కినట్టుగా అనిపిండచం లేదు. సాధ్యాసాధ్యాలను మరిచిపోయి ఆవేశంలో హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది. పైగా బాయ్‌కాట్‌ అనే పదాన్ని కూడా ఇంగ్లీష్‌లో తప్పుగా రాశాడు.

వాసుదేవ్‌ వీడియోను ట్రోల్‌ చేస్తూ స్పూఫ్‌ వీడియోను నెట్టింట్లోకి వదిలారు మరికొందరు. అల్‌జజీరా ఛానల్‌కి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అక్బర్‌ అల్‌ బకర్‌ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూని దీని కోసం వాడుకున్నారు. ఈ స్పూఫ్‌ వీడియోలో వాసుదేవ్‌ ఇచ్చిన వార్నింగ్‌కి ఖతర్‌ సీఈవో భయపడిపోయి గజగజ వణికిపోతున్నాడనే రేంజ్‌లో స్పూఫ్‌ వీడియోను రూపొందించారు. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్‌గా మారింది. అసలు విషయాన్ని పక్కన పెట్టి వాసుదేవ్‌ వార్నింగ్‌, దానికి కౌంటర్‌గా వచ్చిన స్పూఫ్‌ వీడియోపై ఫోకస్‌ చేస్తున్నారు. 

సున్నితమైన అంశాలపై ఎలా ముందుకు పోవాలో తెలియక ప్రభుత్వాలే తలలు పట్టుకుంటున్నాయ్‌. అంతర్జాతీయంగా భారత్‌ వాణిజ్య ప్రయోజనాలు, వలస కార్మికుల భద్రతతో ముడిపడిన అంశాలపై ఇష్టారీతిగా సోషల్‌ మీడియాలో పోస్టులు రావడాన్ని చాలా మంది తప్పుపడుతుండగా మరికొందరు ఏ అంశంపైన అయినా చర్చ జరగాల్సిందే అంటున్నారు. 

చదవండి: Virtual Influencer Kyra Story: వావ్‌ కైరా! ఎందుకమ్మా.. నీకు ఇంతమంది ఫ్యాన్స్‌?

మరిన్ని వార్తలు