-

ఐపీఎల్‌లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్‌ చేస్తారో తెలుసా?

8 Sep, 2021 12:40 IST|Sakshi

కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన టెలివిజన్‌ రంగానికి ఆటలు ఊపిరి పోస్తున్నాయి. ఒకప్పుడు టీవీ యాడ్‌ రెవెన్యూలో పది శాతంగా ఉన్న స్పోర్ట్స్‌ వాటా ఇటీవల 20 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా టీమిండియాలో క్రికెట్‌లో విజయాలు సాధిస్తుంటే దానికి తగ్గట్టుగా టీవీల యాడ్‌ రెవిన్యూ బౌండరీలు దాటేస్తోంది. 

ఆదుకున్న ఆస్ట్రేలియా పర్యటన
కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో దాని ప్రభావం అడ్వెర్‌టైజ్‌ రంగంపై పడింది. దీంతో యాడ్‌ రెవెన్యూ ఆధారంగా నడిచే టెలివిజన్‌ రంగానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అయితే ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా సంచలనం సాధించడం.. ఆ వెంటనే ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కాకవడంతో ఒక్కసారిగా యాడ్‌ రెవెన్యూ పట్టాలెక్కింది. మధ్యలో కరోనా కరోనా సెకండ్‌ వేవ్‌ ఇబ్బంది పెట్టినా టోక్యో ఒలింపిక్స్‌ ఆదుకున్నాయి. 

పెరిగిన స్పోర్ట్స్‌ వాటా 
టీవీ యాడ్‌ రెవెన్యూలో కరోనా ముందు వరకు స్పోర్ట్స్‌ వాటా 10 నుంచి 15 శాతం వరకే ఉండేది. అయితే ఫస్ట్‌ వేవ్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌ ప్రారంభంతో ఒక్కసారిగా యాడ్‌ రెవెన్యూ వాటా 20 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్‌ మీడియా ఆఫ్‌ అడ్వెర్‌టైజింగ్‌ కంపెనీ డీడీబీ గ్రూప్‌ ఎండీ రామ్‌ మోహన్‌ సుందరమ్‌ తెలిపారు. కరోనాకి ముందు టీవీ యాడ్‌ రెవెన్యూ రూ. 28,000 కోట్లు ఉండగా ఇందులో క్రీడల వాటా రూ. 2,500 కోట్లుగా ఉండేంది. ఐపీఎల్‌ తర్వాత ఇది ఏకంగా రూ. 4500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు చేరుకుందని ఆయన వెల్లడించారు.

అగ్రస్థానం క్రికెట్‌దే
టీవీలకు ఆదాయం సంపాదించి పెడుతున్న ఆటల్లో క్రికెట్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్‌ ద్వారా రూ.300ల నుంచి రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్‌ కప్‌ ద్వారానే రూ.1,200 కోట్ల రెవెన్యూ వస్తుందని యాడ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఐపీఎల్‌ 14 సీజన్‌ యాడ్‌ రెవిన్యూ విలువ అయితే ఏకంగా రూ. 2,500 కోట్లుగా ఉంది.

క్షణానికి లక్ష 
ప్రపంచకప్‌, టోక్యో ఒలింపిక్స్‌లను మించిన డిమాండ్‌ బుల్లితెరపై ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌కి ఉంది. ఇటీవల మధ్యలో ఆగిపోయిన సీజన్‌ 14కి సంబంధించి కేవలం పది సెకన్ల యాడ్‌కి రూ. 14 లక్షల వంతున ఛార్జ్‌ చేశాయి టీవీలు. అంటే ఒక్క సెకనుకి లక్షకు పైగానే ధర పలుకుతోంది. అయినా సరే కార్పొరేట్‌ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. టీవీలు అడిగినంత సొమ్ము చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నాయి.

సినిమాను దాటేసింది
ఇండియన్‌​ టెలివిజన్‌ యాడ్‌ రెవిన్యూలో ఇప్పటికీ అగ్రస్థానం సీరియల్లే ఆక్రమించాయి. ఆ తర్వాత సినిమాలు, న్యూస్‌, స్పోర్ట్స్‌, మ్యూజిక్‌, కిడ్స్‌ విభాగాలు ఉండేవి. క్రమంగా సినిమాలను స్పోర్ట్స్‌ వెనక్కి నెట్టేస్తోంది. పిచ్‌ మాడిసన్‌ 2019 రిపోర్టు ప్రకారం యాడ్‌ రెవెన్యూలో న్యూస్‌ వాటా 11 శాతం ఉండగా స్పోర్ట్స్‌ వాటా 10 శాతానికి చేరుకుంది. సినిమాలు 8 శాతానికే పరిమితం అయ్యాయి. మ్యూజిక్‌, కిడ్స్‌ 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

చదవండి : Jeff Bezos: ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్‌ బెజోస్‌..!

మరిన్ని వార్తలు