శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు

9 Apr, 2022 14:47 IST|Sakshi

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలాడుతున్న శ్రీలంక ప్రభుత్వం ఉన్న కొద్ది పాటి ఆర్థిక నిల్వలను కాపాడుకునే పనిలో పడింది. అందులో భాగంగా వడ్డీరేట్లను భారీగా పెంచుతూ శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఉన్నపళంగా వడ్డీరేట్లను దాదాపు రెట్టింపు చేసింది.

గత ఆర్నెళ్లుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తిండి గింజలతో మొదలైన సమస్య పవర్‌, పెట్రోల్‌ కొరతల వరకు పాకింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో బ్యాంకుల్లో నిల్వ ఉన్న కొద్ది పాటీ మొత్తాలు అడుగంటి పోతున్నాయి.

మరోవైపు డాలరుతో శ్రీలంక రూపాయి మారకం విలువ నెల రోజుల వ్యవధిలో 32 శాతం క్షీణించింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా అయినా బూస్ట్‌ ఇచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను రెట్టింపు చేసింది. దీని ప్రకారం స్టాండింగ్‌ లెండింగ్‌ రేటు 14.5 శాతానికి చేరుకోగా స్టాండింగ్‌ డిపాజిట్‌ వడ్డీ రేటు 13.5 శాతానికి చేరుకుంది.

శ్రీలంకలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. 2022 మార్చిలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 18.7 శాతానికి చేరుకుంది. విదేశాల నుంచి నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకునేందుకు ఆ దేశం దగ్గర డాలర్ల నిల్వలు లేని పరిస్థితి నెలకొంది. 


చదవండి: సంక్షోభంతో బెంబేలెత్తిన ఇన్వెస్టర్లు.. ఆకస్మాత్తుగా కొలంబో మార్కెట్‌ క్లోజ్‌

మరిన్ని వార్తలు