Sri Lanka crisis: టొమాటో కిలో రూ. 150, క్యారెట్ కిలో రూ. 490

12 Jul, 2022 12:37 IST|Sakshi

కొలంబో: శ్రీలంక సంక్షోభం చరిత్రలో ఒక గుణపాఠంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక, రాజకీయ సంక్షోభం అక్కడి ప్రజలను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. మునుపెన్నడూ లేని విధంగా కిరాణా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కనీసం తినడానికి తిండి లేక సామాన్యులు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు పెట్రోలు సంక్షోభం పట్టి పీడిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘1990’ అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది.

కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటా శ్రీలంక రూపాయల్లో 150కి అమ్ముడవుతోంది. కిలో ఉల్లి శ్రీలంక రూపాయల్లో 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు శ్రీలంక రూపాయల్లో 220కి విక్రయిస్తున్నారు.  కిలో క్యారెట్ రూ.490కి, పావుకిలో వెల్లుల్లి రూ.160కి విక్రయిస్తున్నారు.  సరఫరా కొరతతోపాటు, రవాణా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని కూరగాయల విక్రయదారులు  వాపోతున్నారు.


ఫైల్‌ ఫోటో

కాగా 1948లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ద్వీపం దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ ఇంధనం లాంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తన రాజీనామా  చేయనున్నారని తెలుస్తోంది. నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడం, ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే  వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టడం లాంటి పరిణామాలు తెలిసినదే.
 

మరిన్ని వార్తలు