భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్!

20 Jul, 2021 16:16 IST|Sakshi

కొద్ది రోజుల క్రితమే సౌర తుపాన్ ముప్పు నుంచి తప్పించుకున్న భూమి వైపు తాజాగా తాజ్‌మహల్ కంటే 3 రెట్లు పెద్దగా ఉన్న ఒక ఆస్టరాయిడ్ దూసుకొస్తుంది. '2008 జివో20' అనే ఈ గ్రహశకలం గంటకు 18,000 మైళ్ల వేగంతో భూమి వైపు రానుంది. అయితే, దీని గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. నాసా ప్రకారం ఈ గ్రహశకలం జూలై 24న భూమిని దాటుతుంది. అంతరిక్ష సంస్థ దీనిని అపోలో తరగతి గ్రహశకలంగా వర్గీకరించింది. ఇది ఒక స్టేడియం కంటే పెద్దదిగా లేదా తాజ్ మహల్ పరిమాణంతో పోలిస్తే మూడు రెట్లు పెద్దది. 

ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తున్నప్పటికి నాసా లెక్కల ప్రకారం.. ఇది భూమికి 0.04 ఏయు(ఖగోళ యూనిట్) దూరం నుంచి వెళ్లనుంది. అంటే భూమికి, ఆస్టరాయిడ్ కి మధ్య 3,718,232 మైళ్ల దూరం ఉంటుంది. సులభంగా చెప్పాలంటే ప్రస్తుతం చంద్రుడు, భూమి నుంచి సుమారు 2,38,606 మైళ్ల దూరంలో ఉన్నాడు. ఈ ఆస్టరాయిడ్ 2008 జివో20 జులై 25న ఉదయం 3 గంటల (ఇండియన్ టైమ్ ప్రకారం)కు ఇది భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో అది భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, ఇది భూమికి దగ్గరగా వస్తున్న కారణంగా నాసా దీనిని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ గా ఇప్పటికీ వర్గీకరించింది.

గ్రహశకలాలు అంటే ఏమిటి?
నాసా ప్రకారం, గ్రహశకలాలు అంటే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి మిగిలిపోయిన రాతి అవశేషాలు. ప్రస్తుతం 1,097,106 గ్రహశకలాలు విశ్వంలో ఉన్నాయి. ఇవి ఉల్కల కంటే భిన్నంగా ఉంటాయి. గ్రహశకలం కదలికను గుర్తించే నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జెపీఎల్) ప్రకారం, మన గ్రహం నుండి దూరం భూమి నుండి సూర్యుడికి దూరం కంటే 1.3 రెట్లు తక్కువగా ఉన్నప్పుడు ఒక గ్రహశకలాన్ని ఒక నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (NEO)గా వర్గీకరిస్తారు.

మరిన్ని వార్తలు