ఇలా అయితే వృద్ది అంచనాకు కోత తప్పదు

29 Apr, 2021 14:30 IST|Sakshi

రేటింగ్‌ దిగ్గజం ఎస్‌&పీ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి రికవరీకి సెకండ్‌వేవ్‌ కేసుల పెరుగుదల తీవ్ర అవరోధంగా మారుతున్న నేపథ్యంలో తమ తొలి వృద్ధి రేటు అంచనాలను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌&పీ) పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన చేసింది. కరోనా కేసుల తీవ్రతతో భారత్‌ ఎకానమీకి సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపింది. వ్యాపార కార్యకలాపాల్లో తీవ్ర అవరోధాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) భారత్‌ 11 శాతం వృద్ధి సాధిస్తుందన్నది ఎస్‌అండ్‌పీ తొలి అంచనా. 

తీవ్ర అనిశ్చితి 
కోవిడ్‌-19 తాజా కేసుల పెరుగుదల భారత్‌ వృద్ధి అవకాశాలను అనిశ్చితిలో పడేస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. దీనితో రికవరీకి అవరోధాలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తిరిగి తీసుకుంటే, అది వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని వివరించింది. ‘‘ఇదే జరిగితే మా తొలి అంచనా 11 శాతం వృద్ధిని సవరించే అవకాశం ఉంది’’ అని ఎస్‌అండ్‌పీ ప్రకటన తెలిపింది. మహమ్మారి వల్ల ఇప్పటికే ఉత్పత్తి, వృద్ధిలో తీవ్రంగా నష్టపోయిందని వివరించింది. దీర్ఘకాలంలో చూస్తే,జీడీపీలో 10 శాతానికి సమానమైన ఉత్పత్తి విలువను కోల్పోతున్నట్లు తెలిపింది. సెకండ్‌వేవ్‌లో పెద్ద ఎత్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం చాలా తీవ్ర విషయమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కేసులు కూడా భారీగా పెరుగుతుండడం ఎకానమీకి ప్రతికూలంగా మారుతోందని తెలిపింది. ఆయా అంశాలు ఆరోగ్య మౌలిక రంగాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు విశ్లేషించింది.

రుణ పరిస్థితిపై ప్రభావం 
ఎస్‌అండ్‌పీ ఆర్థిక రంగానికి సంబంధించి విశ్లేషిస్తూ, 2021-22 బడ్జెట్‌ లక్ష్యాలను నెరవేర్చాలంటే భారీ వృద్ధి తప్పనిసరని తెలిపింది. తద్వారానే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇప్పటికే అధికంగా రుణ భారాన్ని స్థిరీకరించవచ్చని అంచనావేసింది. ఆయా అంశాలన్నీ సార్వహౌమ క్రెడిట్‌ రేటింగ్‌పై ప్రభావాన్ని చూపుతాయని తెలపింది. ప్రస్తుతం భారత్‌ ఎకానమీకి స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’ను కొనసాగిస్తోంది. చెత్త (జెంక్‌)కు ఇది ఒక్క అంచ మాత్రమే ఎక్కువ.

ఉపాధిపై ప్రతికూలత
రాష్ట్రాల్లో స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్లు రోజూవారీ ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ఆయా అంశాలన్నీ ఎకానమీ రికవరీకి అలాగే కార్పొరేట్‌ ఆదాయ, వ్యయాలకు గండి కొడుతున్నాయని పేర్కొంది. ఇక బ్యాంకులు సైతం భారీ మొండిబకాయిల స్థితిలోకి జారే ప్రమాదముందని హెచ్చరించింది.

మరిన్ని ‘వేవ్స్‌’కు అవకాశం 
భారత్‌లో ప్రస్తుతం ఉన్న కోవిడ్‌-19 వేరియెంట్లు పాకడం నుంచి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం తప్పించుకోలేకపోచ్చన్న అనుమానాన్ని ఎస్‌అండ్‌పీ వ్యక్తం చేయడం గమనార్హం. కొన్ని వైరెస్‌ మ్యుటేషన్స్‌పై పోరులో కొన్ని వ్యాక్సినేషన్‌ల సామర్థ్యం పరిమితంగా ఉందని పేర్కొంటూ, ఈ కారణంగా ఆసియా పసిఫిక్‌ దేశాలు మరిన్ని వేవ్స్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది.

ఫిచ్, మూడీస్‌ ఇలా... 
గత వారం మరో గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ- ఫిచ్‌ భారత్‌ ఎకానమీ 2021-22 వృద్ధి రేటును 12.8 శాతంగా అంచనావేసింది. మరో సంస్థ-మూడీస్‌ తన నివేదికలో భారత్‌ వృద్ధిపై సెకండ్‌వేవ్‌ ప్రభావం ఉంటుందని పేర్కొంది.

చదవండి:

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు