అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్‌ రిపీట్‌..! 

6 Oct, 2021 18:44 IST|Sakshi

చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రష్యా చిత్ర బృందం అక్టోబర్‌ 5 న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు అంతరిక్ష యాత్రకు సిధ్దమయ్యాడు. 

స్పేస్‌ టూరిజం పరుగులు..!
పలు అంతరిక్ష సంస్థలు బ్లూ  ఆరిజిన్‌, స్పేస్‌ఎక్స్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ ఎక్స్‌, వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రెండో అంతరిక్ష యాత్రను త్వరలోనే చేపట్టనుంది. ఈ యాత్రలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విలియమ్‌ షట్నర్‌ పాలుపంచుకొనున్నాడు. విలియమ్‌ షట్నర్‌ స్పందిస్తూ..ఈ అంతరిక్ష యాత్ర పట్ల ఎంతో థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాను. అంతేస్థాయిలో కొంచెం భయం కూడా వేస్తోందని విలియమ్‌ షట్నర్‌ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష యాత్ర అ​క్టోబర్‌ 12 న జరగనుంది. 
చదవండి: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్‌ ఎప్పుడంటే..

స్టార్‌ ట్రెక్‌ సినిమాతో ఫేమస్‌...!
స్టార్‌ ట్రెక్‌ సినిమాలో కెప్టెన్‌ జేమ్స్‌ టి. కిర్క్‌ పాత్రను విలియమ్‌ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్‌ ట్రెక్‌ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. విలియమ్‌ షట్నర్‌ సినిమాలో పొందిన అనుభూతిని ఇప్పుడు నిజజీవితంలో అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాడు.  

అతి పెద్ద వయస్కుడిగా రికార్డు...!
ఒకవేళ బ్లూ ఆరిజిన్‌ చేపట్టనున్న ప్రయోగం  విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్‌ షట్నర్‌ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్‌ షట్నర్‌ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్‌ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది.

చదవండి: ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..!

మరిన్ని వార్తలు