Starlink: డబ్బులు కట్టి నెలలు అవుతున్నా..శాటిలైట్‌ ఇంటర్నెట్‌పై అసహనం

17 Oct, 2021 16:45 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించేందుకు స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా..ఇప్పటికే ప్రీ ఆర్డర్లు బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ఇంటర్నెట్‌ను అందించడంలో ఎలన్‌పై విమర్శలు వెల‍్లువెత్తుతున్నాయి. అమెరికాలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ కోసం వినియోగదారులు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకొని నెలలు కావొస్తున్నా ఇంటర్నెట్‌ సేవలు అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

స్టార్‌ లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు యూఎస్, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్,10 యూరోపియ‌న్ కంట్రీస్ క‌లిపి మొత్తం 14దేశాల్లో పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కానీ 90శాతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉన్న యూఎస్‌లో..కొందరికి శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించే విషయంలో ఎలన్‌ మస్క్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాన్ డ్యూరాన్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో 100 డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో రూ.7,503.50) డిపాజిట్ చెల్లించాడు. డిపాజిట్‌ చెల్లించిన తరువాత స్టార్‌ లింక్‌ కిట్‌ అందుతుంది. కానీ జాన్‌ ప్రీ ఆర్డర్‌ బుక్‌ చేసుకొని 9నెలలు అవుతున్నా స్టార్‌లింక్‌ నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. కాంటాక్ట్‌ చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి.

చివరికి సెప్టెంబర్‌లో స్టార్‌లింక్‌ ప్రీ ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు జాన్‌ తెలిపారు. నేను పిచ్చివాడిని కాదు,స్టార్‌ లింక్‌ సర్వీస్‌ విషయంలో చాలా అసంతృప్తికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం జాన్‌ ఇంటర్ నెట్‌ కోసం ఫోన్ నుండి మొబైల్ హాట్‌స్పాట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఒక జానే కాదు మరి కొంతమంది వినియోగదారులు సైతం ప్రీ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేయడంతో కట్టిన మనీ తిరిగి ఇచ్చేశారని,మరి ఇంటర్నెట్‌ సేవల్ని ఎప్పుడు అందిస్తారో చెప్పాలని అంటున్నారు.ఇప్పటికే ఎలన్‌ మస్క్‌ వరల్డ్‌ వైడ్‌గా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్‌ను అందించేందుకు 1600 శాటిలైట‍్లను స్పేస్‌లోకి పంపారు. మొత్తంగా 42వేల శాటిలైట్లను పంపే పనిలో పడ్డారు. త్వరలో వరల్డ్‌ వైడ్‌గా ఇంటర్నెట్‌ను అందిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఎలన్‌  వినియోగదారుల నుంచి వస్తున్న విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

చదవండి: అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్‌

మరిన్ని వార్తలు