SpaceX Starlink: రికార్డు సృష్టించిన స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌..! స్పీడ్‌ ఎంతంటే..

7 Aug, 2021 20:29 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌సేవలను అందించడం కోసం ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రోగ్రాంను ముందుకుతెచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్‌ ప్రోగ్రాంలో భాగంగా శాటిలైట్లనుపయోగించి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను అందించనుంది. ఇప్పటికే అమెరికాతో సహా 11 దేశాల్లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించవచ్చునని స్పేస్‌ ఎక్స్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ షాట్‌వెల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలతో పోలిస్తే  స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ గరిష్ట వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. తాజాగా  ఊక్లా నిర్వహించిన స్పీడ్‌ టెస్ట్‌లో స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రికార్డు సృష్టించింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం 2021 రెండో త్రైమాసికంలో అమెరికాలోని ఇతర బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తోన్న హ్యూస్ నెట్, వియాసట్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలను పోల్చింది.యునైటెడ్ స్టేట్స్‌లో మెరుపువేగంతో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోన్న బ్రాడ్‌బ్యాండ్‌గా ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ మాత్రమే నిలిచింది.  

స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సరాసరిగా 97.23 Mbps స్పీడ్‌ను అందిస్తోంది. హ్యూస్‌నెట్ రెండో స్థానంలో  19.73 Mbps వేగంతో,  వియాసత్ మూడో స్థానంలో 18.13 Mbps  వేగంతో నిలిచాయని ఊక్లా పేర్కొంది. కాగా స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ గరిష్టంగా 139.39  Mbps డౌన్‌లోడ్‌ వేగాన్ని అందించింది. స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ అప్‌లోడింగ్‌ వేగంలో కూడా రికార్డులను నమోదు చేసింది. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌, ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ అప్‌లోడింగ్‌ స్పీడ్‌ ను అధిగమించింది.

అప్‌లోడింగ్‌ వేగంలో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 15.99 Mbps, రెండో త్రైమాసికంలో 17.18 Mbps నమోదు చేసింది. స్టార్‌లింక్‌ తరువాత వియాసత్‌ అప్‌లోడింగ్‌ స్పీడ్‌లో రెండో స్థానంలో నిలిచింది. వియాసత్‌ అప్‌లోడింగ్‌ స్పీడ్‌లో 3.38 Mbps, హ్యూస్‌నెట్ అప్‌లోడింగ్‌ స్పీడ్‌లో 2.43 Mbps వద్ద నిలిచింది. స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌లోని ఉపగ్రహాలు ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌’లో కలిగి ఉండడం ద్వారా ఈ స్పీడ్‌ సాధ్యమైందని ఊక్లా పేర్కొంది.

మరిన్ని వార్తలు