ఫొటోషూట్‌ లేకుండానే మోడల్స్‌ చిత్రాలు

2 Dec, 2020 10:08 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసిన ట్రై3డీ

దుస్తుల విక్రేతలకు ఉపయుక్తం

ఆన్‌లైన్‌లో విస్తరణకు దోహదం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దుస్తుల దుకాణానికి వెళ్లినప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించి, ఒకసారి వేసుకుని మరీ చూస్తాం. నచ్చితేనే కొంటాం. ఆన్‌లైన్‌లో అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈకామర్స్‌ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్‌ చేసి మరీ దుస్తులను ప్రదర్శిస్తాయి. ఇంత వరకు బాగానే ఉంది. మరి చిన్న చిన్న విక్రేతలు ఆన్‌లైన్‌లో ఎలా పోటీపడాలి? ఖరీదైన ఫొటోషూట్స్‌తో పనిలేకుండా ఫోన్‌లో తీసిన సాధారణ చిత్రాలు 3డీ రూపంలో మారితే? అలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ విద్యార్థులైన తెలుగు కుర్రాళ్లు నితీశ్‌ రెడ్డి పర్వతం, కృష్ణ సుమంత్‌ అల్వాల అభివృద్ధి చేశారు. నాస్కాం, ఐఐటీ మద్రాస్‌ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ కంపెనీ పేరు ట్రై3డీ.  

ఎలా పనిచేస్తుందంటే..
విక్రేతలు ట్రై3డీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎంపిక చేసిన దుస్తులను రెండు మూడు ఫొటోలు తీసి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న టెంప్లేట్‌కు జత చేయాలి. వెంటనే 3డీ రూపంలో ఫొటో రెడీ అవుతుంది. రెండు మూడు నిముషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటోషూట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాలు సహజంగా కనిపిస్తాయి. ఈ 3డీ చిత్రాలను ఈ-కామర్స్‌ పోర్టల్స్‌లో, సొంత వెబ్‌సైట్స్‌లో ప్రదర్శించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ఫోటోలను పోస్ట్‌ చేసి వ్యాపారం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. మోడల్స్‌తో ఫొటోషూట్‌ చేసి ఈ టెంప్లేట్స్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు పలువురు మోడళ్లతో వివిధ భంగిమల్లో 250 రకాల టెంప్లేట్స్‌ను సిద్ధం చేశారు.  

సులభంగా ఆన్‌లైన్‌లో..
ఆఫ్‌లైన్‌కు పరిమితమైన విక్రేతలు ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్‌కూ విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని ట్రై3డీ కో-ఫౌండర్‌ నితీశ్‌ రెడ్డి పర్వతం సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘చీరలు, డ్రెస్‌ మెటీరియల్, హోం డెకోర్‌ ఉత్పత్తులను 3డీ రూపంలో మార్చవచ్చు. ఫొటోషూట్స్‌ ఖర్చులు ఉండవు. భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయికి చెందిన 260 మంది కస్టమర్లు విజయవంతంగా వ్యాపారాన్ని విస్తరించారు. భారత్‌లో ప్రముఖ ఫ్యాషన్‌ ఈ-కామర్స్‌ కంపెనీ ఈ జాబితాలో ఉంది. ఏడాది కాలంలో మా క్లయింట్లు 80 వేలకుపైగా 3డీ చిత్రాలతో అమ్మకాలను సాగించారు. కోవిడ్‌-19 కారణంగా వినియోగదార్లు ఆన్‌లైన్‌కు మళ్లుతుండడంతో మా క్లయింట్ల సంఖ్య పెరుగుతోంది. 100  క్రెడిట్స్‌కు రూ.5,000 చార్జీ చేస్తున్నాం. రూ.3 లక్షల వార్షిక ఫీజుతో అపరిమిత క్రెడిట్స్‌ వాడుకోవచ్చు’ అని వివరించారు.

మరిన్ని వార్తలు