స్టార్టప్‌లపై అవగాహన పెరగాలి

21 Mar, 2023 06:36 IST|Sakshi

ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌ కుమార్‌

పనాజీ: దేశీయంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మరింత అవగాహన పెరగాల్సి ఉందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌లో స్టార్టప్‌ల వైఫల్య రేటు క్రమంగా తగ్గుతోందని ఆయన చెప్పారు. ‘నేను అనేక ఇంజినీరింగ్‌ కాలేజీలను సందర్శిస్తుంటాను. వారికి స్టార్టప్‌లు, ఎస్‌టీపీఐ గురించి .. అంకుర సంస్థల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న విషయాలేవీ తెలియవు‘ అని అరవింద్‌ కుమార్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్‌టీపీఐ డైరెక్టర్లు వివిధ కాలేజీలను సందర్శిస్తూ అంకుర సంస్థలు, వాటికి నిధుల సమీకరణ తదితర అంశాల గురించి యువతకు వివరిస్తున్నారని తెలిపారు.

దీంతో నెమ్మదిగా అవగాహన పెరుగుతోందని, అయితే దీన్ని మరింత వేగవంతం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదనలకు సంబంధించిన వివిధ దశల గురించి విద్యార్థులు నేర్చుకునేందుకు 12వ తరగతిలోనే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని, వారు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిగా ఎదిగేలా తోడ్పాటు అందించాలని అరవింద్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. వైఫల్యమనేది అంతర్జాతీయంగా కూడా స్టార్టప్‌ వ్యవస్థలో అంతర్గత భాగమేనని, మనం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాం కాబట్టి మిగతా దేశాలతో పోలిస్తే వైఫల్యాలు కాస్త ఎక్కువ స్థాయిలోనే అనిపించవచ్చని ఆయన చెప్పారు. కానీ, భారత్‌లో విఫలమవుతున్న అంకుర సంస్థల సంఖ్య తగ్గుతోందని, పదింటిలో ఒకటిగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు