శాలరీ ఎక్కువ ఇస్తున్నారని..టెంప్ట్‌ అయ్యారా కొంప కొల్లేరే!

20 Jun, 2022 18:47 IST|Sakshi

సమ్మర్‌ సీజన్‌లో తమ లాభాలతో హీటెక్కించిన స్టార్టప్‌లు..వింటర్‌ సీజన్‌లో నిధుల కొరతతో వణికి పోతున్నాయి. వెరసి కాస్ట్‌ కటింగ్‌లు పేరుతో ఉద్యోగుల్ని తొలగించాయి. తొలగిస్తున్నాయి. అలా ఇప్పటి వరకు మనదేశంలో 10వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.  

మనీ కంట్రోల్‌ రీసెర్చ్‌ ప్రకారం.. గతేడాది స్టార్టప్‌లలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులతో స్టార్టప్‌ల మధ్య టాలెంట్‌ వార్‌ నడిచింది. అందుకే ఒక సంస్థతో మరో సంస్థ పోటీ పడుతూ కళ్లు చెదిరేలా జీతాలిచ్చి ఉద్యోగుల్ని ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఎంత వేగంతో రిక్రూట్‌ చేసుకున్నాయో..అంతే వేగంతో ఉద్యోగులకు గుడ్‌ బై చెబుతున్నాయి. ఈ తొలగింపులు ఎక్కువగా అమ్మకాలు, మార్కెటింగ్ విభాగాల్లో ఎక్కువగా ఉన్నాయని నివేదికలు హైలెట్‌ చేస్తుండగా.. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలున్నాయని చెబుతున్నాయి. 

ఉద్యోగుల తొలగింపు  
గురుగ్రామ్ ప్రధాన కేంద్రంగా 3 ఏళ్ల క్రితం సోషల్ కామర్స్ స్టార్టప్ సిటీమాల్ ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి నెలలో 75 మిలియన్ల నిధుల్ని ఇన్వెస్టర్ల నుంచి సేకరించింది. జూన్ 19న లింక్డ్ఇన్ పోస్ట్‌లో వృద్ది, వ్యాపార వ్యూహాల్ని కారణాలుగా చూపిస్తూ 191 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఇలా సిటీమాల్‌తో పాటు దాదాపూ 25కి పైగా స్టార్టప్‌లు నిధుల కొరత, పునర్నిర్మాణం,మొదలైన వాటిని పేర్కొంటూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వాటిలో మీషో, కార్స్24, ఓలా, బ్లింకిట్లు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగులు పనితీరు సరిగ్గా లేదని ఆరోపించాయి. ఏదేమైనా, ప్రస్తుత కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నది భారతీయ ఎడ్టెక్ స్టార్టప్‌లేనని తెలుస్తోంది. 

ఎడ్‌టెక్‌కు పెద్ద దెబ్బే
కోవిడ్-19 ఆంక్షల సడలింపుతో ఫిజికల్ ట్యూషన్ సెంటర్లు, స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. దీంతో రిమోట్ లెర్నింగ్, టెక్నాలజీ ఆధారిత ఎడ్యుకేషన్ సర్వీసులకు డిమాండ్ తగ్గిపోయింది. అదే సమయంలో వింటర్‌ సీజన్‌లో నిధుల కొరత ఎక్కువైంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఎడెటెక్‌ సంస్థలైన అన్అకాడమీ, వేదాంతు, లిడో లెర్నింగ్ లపై ప్రభావం పడింది. పైన పేర్కొన్న సంస్థలు 38 శాతంతో 4వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించాయి. ఉదాహరణకు జూన్ 18న అన్అకాడమీ మరో 150 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో10శాతంతో సుమారు 600 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగ నంపింది. 

శాలరీ ఎక్కువని టెంప్ట్‌ అయ్యారా! 
కోవిడ్‌ సమయంలో ఉద్యోగుల్ని ఆకర్షించేందుకు స్టార్టప్‌లు భారీ ఎత్తున జీతాలిచ్చాయి. వారిని నిలుపుకునేందుకు కొన్ని సందర్భాలలో బీఎండబ్ల్యూలాంటి కార్లని ఉద్యోగులకు అందించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిధులు లేక..ఎక్కువ జీతాలిచ్చిన సంస్థలు సైతం ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నాయి. అందుకే స్టార్టప్‌లో ఉద్యోగం అంటే కత్తిమీద సామేనని, సంస్థ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని హెచ్‌ఆర్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉 ఉద్యోగులకు బంపరాఫర్‌,ఫుల్‌ శాలరీ ఇస్తాం..365 రోజులు సెలవులు తీసుకోండి!

మరిన్ని వార్తలు