స్టార్టప్‌లతో 10 కోట్ల కొలువులు

22 Jun, 2022 05:20 IST|Sakshi

కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి

సెకోయా ఎండీ ఆనందన్‌

న్యూఢిల్లీ: దేశీ డిజిటల్‌ వ్యవస్థ తోడ్పాటుతో అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో 10 కోట్ల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించగలవని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సెకోయా క్యాపిటల్‌ ఎండీ రాజన్‌ ఆనందన్‌ చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే దేశీ స్టార్టప్‌లు ప్రధానంగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘గత కొన్నాళ్లుగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలి. ఇందుకు సంబంధించి పాటించాల్సిన ప్రక్రియలు, క్రమశిక్షణ మొదలైన వాటి గురించి వ్యవస్థాపకుల్లో అవగాహన పెంచుతున్నాం‘ అని ఆనందన్‌ వివరించారు. సెకోయా ఇన్వెస్ట్‌ చేసిన భారత్‌పే, జిలింగో సంస్థల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌పరమైన సమస్యలు బైటపడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ అంశాల ఊతంతో అమెరికా, భారత్, చైనా తదితర దేశాల్లోని స్టార్టప్‌ వ్యవస్థల్లోకి భారీగా నిధులు వచ్చిపడ్డాయని ఆనందన్‌ చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చైనా వ్యవస్థలోకి గతేడాది దాదాపు 130 బిలియన్‌ డాలర్లు, అలాగే భారత స్టార్టప్‌ సంస్థల్లోకి 40 బిలియన్‌ డాలర్లు వచ్చినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయని ఆనందన్‌ చెప్పారు. ‘ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా రేట్లు వేగంగా పెంచవచ్చు. ఎకానమీలోకి కుమ్మరించిన 7 లక్షల కోట్ల డాలర్లలో సింహభాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా స్టార్టప్‌లు ఎదిగేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు.   

మరిన్ని వార్తలు