బెంగళూరులో స్టార్టప్స్‌ అంతర్జాతీయ సదస్సు

2 Jun, 2022 05:50 IST|Sakshi

నేటి నుంచి రెండు రోజులపాటు ఐజీఐసీ

బెంగళూరు: స్టార్టప్‌ సంస్థలకు సంబంధించిన తొలి అంతర్జాతీయ సదస్సు.. ఇండియా గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ కనెక్ట్‌ (ఐజీఐసీ) బెంగళూరులో గురువారం ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కర్ణాటక డిజిటల్‌ ఎకానమీ మిషన్‌ భాగస్వామ్యంతో అడ్వైజరీ సంస్థ స్మాద్యా అండ్‌ స్మాద్యా నిర్వహిస్తోంది. కాటమారన్‌ వెంచర్స్, టాటా డిజిటల్‌ తదితర సంస్థలు స్పాన్సర్‌ చేస్తున్నాయి. తొలి ఐజీఐసీ సదస్సులో భారత్‌తో పాటు సింగపూర్, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, కొరియా, జర్మనీ తదితర దేశాల నుండి 80 మంది పైగా వక్తలు పాల్గొంటున్నారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పాల్‌ సాఫో మొదలైన వారు వీరిలో ఉన్నారు.

ఇందులో 22 సెషన్లు ఉంటాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, టాప్‌ వెంచర్‌ క్యాపిటలిస్టులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చాగోష్టులు ఉంటాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఈ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నవకల్పనల సూచీలో 2016లో 66వ స్థానంలో నిల్చిన భారత్‌ ప్రస్తుతం 46వ ర్యాంకుకు ఎగబాకిందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా మారిందని స్మాద్యా అండ్‌ స్మాద్యా అడ్వైజరీ ప్రెసిడెంట్, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం మాజీ ఎండీ క్లాడ్‌ స్మాద్యా తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఐజీఐసీ.. భారత అంకుర సంస్థల సామర్థ్యాలు, ఆవిష్కరణల గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు మంచి వేదిక కాగలదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు