Startups: 'రిస్క్ హై తో ఇష్క్ హై', కేంద్ర సహాయ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

3 Jun, 2022 10:00 IST|Sakshi

దేశ భవిష్యత్‌ అంతా స్టార్టప్స్‌ చేతిలోనే

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించేవి స్టార్టప్‌ సంస్థలేనని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. అంకుర సంస్థలకు ఊతం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన విజయాల్లో ఒకటని ఆయన చెప్పారు. ‘స్టార్టప్‌లు భారత భవిష్యత్‌ ఎకానమీని నిర్దేశించగలవు. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్‌ దిశా నిర్దేశం చేయగలదు‘ అని మంత్రి తెలిపారు. 


‘2016లో దేశీయంగా స్టార్టప్‌ వ్యవస్థకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం మొదలుపెట్టింది. దీనితో కేవలం అయిదు–ఆరేళ్లలోనే భారత స్టార్టప్‌ వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎగబాకింది‘ అని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత అంకుర సంస్థలు చరిత్ర లిఖిస్తున్నాయని, అత్యంత తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని అబ్బురపర్చే స్థాయికి ఎదిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు.

‘నవభారతం ఎంత సేపూ భవిష్యత్‌ భద్రత గురించి ఆలోచించడం లేదు. రిస్కులు తీసుకునేందుకు, కొత్తవి ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంటోంది. స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది‘ అని ఆమె వివరించారు. అంకుర సంస్థలు కేవలం కాస్మోపాలిటన్‌ నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఉంటున్నాయని అనుప్రియ పటేల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు