ఎస్‌బీఐ డిపాజిట్, రుణ రేట్ల పెంపు

15 Jun, 2022 01:53 IST|Sakshi

రుణాలపై 0.2% పెరుగుదల

15 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంపుబాట నేపథ్యంలో... భారత్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన డిపాజిట్, రుణ రేట్లను పెంచింది.  మే తొలి వారం తర్వాత సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నెల మొదటి వారంలో ఆర్‌బీఐ 0.50 శాతం రెపో పెంపు నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ తెలిపిన సమాచారం ప్రకారం... 

ఎంపిక చేసిన కాలపరిమితులకు సంబంధించి రూ. 2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.20 శాతం వరకూ పెరిగాయి. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చింది.  
211 రోజుల నుంచి ఏడాది మధ్య డిపాజిట్‌ రేటు ప్రస్తుతం 4.40% ఉంటే ఇది 4.60%కి పెరిగింది.  సీనియర్‌ సిటిజన్లు ప్రస్తుతం 4.90% వడ్డీరేటు తీసుకుంటుండగా, ఇది 5.10%కి పెరగనుంది.  
ఇక ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్‌ రేటు 0.20 శాతం పెరిగి 5.30%కి చేరింది. ఈ విభాగంలో సీనియర్‌ సిటిజన్లు 5.80% వడ్డీ అందుకుంటారు.  
రెండు నుంచి మూడేళ్ల మధ్య వడ్డీరేటు 5.20 శాతం నుంచి  5.35 శాతానికి ఎగసింది. సీనియర్‌ సిటిజన్లు పొందే రేటు 5.70 శాతం నుంచి 5.85 శాతానికి పెరుగుతుంది.  

రూ. రెండు కోట్లపైన డిపాజిట్లు దాటితే... 
రూ.2 కోట్లు ఆపైబడిన డిపాజిట్లకు సంబంధించి వివిధ కాలపరిమితులపై వడ్డీరేటు 0.75%వరకూ పెరిగింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య రేటు 4% నుంచి 4.75%కి పెరిగింది. సీనియర్‌ సిటిజన్లకు ఈ రేటు 4.50% నుంచి 5.25 శాతానికి పెరుగుతుంది. 

రుణ రేట్ల పెరుగుదల ఇలా.. 
నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణరేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను కూడా ఎస్‌బీఐ 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచింది. జూన్‌ 15 నుంచి తాజా పెంపు అమల్లోకి వస్తుంది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలకు దాదాపు ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.20% నుంచి 7.40% కి పెరగనుంది. వెబ్‌సైట్‌   ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్‌ రేటును (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను కూడా  జూన్‌ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంచింది.

ఐడీబీఐ బ్యాంక్‌ కూడా... 
మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌ రూ.2 కోట్ల దిగువన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్ల వరకూ పెంచింది. దేశీయ టర్మ్‌ డిపాజిట్లు, నాన్‌–రెసిడెంట్‌ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌ఓ), నాన్‌–రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) టర్మ్‌ డిపాజిట్లపై 15వ తేదీ నుంచి తాజా పెంపు నిర్ణయం అమలవుతుంది. తాజా నిర్ణయం ప్రకారం, 91 రోజుల నుంచి 6 నెలల మధ్య డిపాజిట్లపై రేటు 3.75% నుంచి 4%కి పెరుగుతుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల  రేటు 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 5.60%కి చేరింది. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్య రేటు 5.60% నుంచి 5.75%కి ఎగసింది. 

మరిన్ని వార్తలు