రికార్డులు కొల్లగొడుతున్న ఎస్‌బీఐ.. బ్యాంక్‌ చరిత్రలో అత్యధికం

7 Nov, 2022 08:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 14,572 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది బ్యాంక్‌ చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ క్యూ2లో దేశీ కార్పొరేట్‌ చరిత్రలో రికార్డ్‌ లాభం ఆర్జించిన సంస్థగా నిలిచింది. తద్వారా ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(రూ. 13,656 కోట్లు)ను అధిగమించింది. 

అంతేకాకుండా మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ(ప్రస్తుత క్యూ2 లాభం రూ. 11,125 కోట్లు)ని సైతం వెనక్కి నెట్టింది. కాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 8,890 కోట్లతో పోలిస్తే ఎస్‌బీఐ లాభం 74 శాతం జంప్‌చేసింది. ఇందుకు రుణ విడుదల, వడ్డీ ఆదాయంలో వృద్ధితోపాటు ప్రొవిజన్లు తగ్గడం సహకరించింది. ఇక ఈ కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 1,01,143 కోట్ల నుంచి రూ. 1,14,782 కోట్లకు ఎగసింది. 
 
స్టాండెలోన్‌ ఇలా :
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ స్టాండెలోన్‌ నికర లాభం 74 శాతం జంప్‌చేసి రూ. 13,265 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 7,627 కోట్లు ఆర్జించింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 77,689 కోట్ల నుంచి రూ. 88,734 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 35,183 కోట్లకు చేరింది. ఈ కాలంలో దేశీ నికర వడ్డీ మార్జిన్లు స్వల్పంగా బలపడి 3.55 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.9 శాతం నుంచి 3.52 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.52 శాతం నుంచి 0.80 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,699 కోట్ల నుంచి తగ్గి రూ. 2,011 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 13.51 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తలు