గృహ రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ బొనాంజా

17 Sep, 2021 00:43 IST|Sakshi

రుణ రేటు తగ్గింపు సహా పలు ఆఫర్లు

ముంబై: గృహ రుణ మార్కెట్‌లో భారీ వాటా దక్కించుకోవడంలో భాగంగా బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణ రేటు తగ్గింపు సహా రుణ గ్రహీతలకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► అత్యధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుంది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్‌ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి 45 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు.  

► ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్‌ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. వీరి మధ్య రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్‌బీఐ తొలగించింది.  

► రుణ బ్యాలన్స్‌ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది.

► ప్రాసెసింగ్‌ ఫీజునూ బ్యాంకింగ్‌ దిగ్గజం రద్దు చేసింది.

రిటైల్‌ రుణాలపై బీఓబీ ఆఫర్లు
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ బ్యాంక్‌ ఆఫ్‌  బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని రిటైల్‌ రుణాలపై పలు ఆఫర్లను ప్రకటించింది.  బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్‌ రుణ రేట్లు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గాయి. కారు రుణ రేటు 7 శాతం వద్ద ప్రారంభమైతే, గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుంది. గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును బ్యాంక్‌ తగ్గించింది. బ్యాంక్‌ మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ లేదా వెబ్‌సైట్‌పై కూడా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు