నిలకడగా ఇన్ఫోసిస్‌ వృద్ధి

18 Aug, 2022 06:12 IST|Sakshi

సీఈవో సలీల్‌ పరేఖ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఎల్లప్పుడూ పటిష్టంగా నిలవడంతోపాటు.. నిలకడగా కొనసాగే కంపెనీగా ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ను సంస్థ సీఈవో సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం కంపెనీ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య వివాదాలు తలెత్తిన సమయంలో సలీల్‌ కంపెనీ పగ్గాలు అందుకున్నారు. 2018 జనవరిలో అప్పటి సీఈవో విశాల్‌ సిక్కా నుంచి ఇన్ఫోసిస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక కంపెనీ కార్యకలాపాలలో నిలకడను తీసుకురావడమేకాకుండా వృద్ధి బాటను కొనసాగించారు.

ఈ కాలంలో కంపెనీకి ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంతోపాటు.. కార్యకలాపాలను వేగవంతం చేశారు. ఇన్ఫోసిస్‌ను వ్యవస్థాపకులు అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దినట్లు ఒక ఇంటర్వ్యూలో పరేఖ్‌ ప్రశంసించారు. దీంతో కంపెనీ ఎల్లప్పుడూ పటిష్టంగా నిలుస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపైన కూడా ఇదే బాటలో కొనసాగనున్నట్లు తెలియజేశారు.

2022–23లో 16 శాతం వరకు వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో కంపెనీ 14–16 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు అంచనా వేశారు. ఇందుకు పటిష్ట డీల్‌ పైప్‌లైన్‌ దోహదపడనున్నట్లు తెలియజేశారు. గత ఐదేళ్లలో ఇన్ఫోసిస్‌ ఆదాయం రూ. 73,715 కోట్ల నుంచి రూ. 1,23,936 కోట్లకు ఎగసింది. 2018 నుంచి 2022 మార్చి మధ్య కన్సాలిడేటెడ్‌ నికర లాభాలు సైతం రూ. 16,029 కోట్ల నుంచి రూ. 22,110 కోట్లకు జంప్‌ చేశాయి.

మరిన్ని వార్తలు