సోలార్‌ మాడ్యూల్స్‌ ‘దేశీయ తయారీ’కి ఊతం!

11 Mar, 2021 14:19 IST|Sakshi

2022 ఏప్రిల్‌ నుంచీ 40 శాతం దిగుమతి సుంకం

సెల్స్‌పై 20 శాతం విధింపు

న్యూఢిల్లీ: దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్‌ మాడ్యూల్స్, సెల్స్‌ విషయంలో కేంద్ర నూతన, పునరుజ్జీవ ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచీ సోలార్‌ మాడ్యూల్స్‌ దిగుమతులపై 40 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు వెల్లడించింది. సెల్స్‌ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. ఈ మేరకు తన ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం వేసినట్లు వెల్లడించింది. ఎంఎన్‌ఆర్‌ఈ విడుదల చేసిన మెమోరాండం ప్రకారం, 2022 మార్చి 31 వరకూ సోలార్‌ మాడ్యూల్స్‌ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. అటుపై వీటిపై సుంకాలు వరుసగా 40 శాతం, 20 శాతాలుగా ఉంటాయి. ఇక మీదట వేసే బిడ్ల విషయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్‌ఈ (పునరుత్పాదక ఇంధనం) అమలు సంస్థలు, సంబంధిత ఇతర వర్గాలకు మంత్రిత్వశాఖ సూచించింది. 

2030 నాటికి గిగావాట్ల లక్ష్యం... 
2022 నాటికి 100 జీడబ్ల్యూ (గిగావాట్ల) సౌర విద్యుత్‌సహా 175 జీడబ్ల్యూ వ్యవస్థాగత పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) సామర్థ్యానికి చేరుకోవాలన్నది భారత్‌ ప్రధాన లక్షంగా ఉంది. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 450 జీడబ్ల్యూకి పెంచాలన్నది కూడా దేశం లక్ష్యం. సోలార్‌ రంగంలో పరికరాలకు ప్రస్తుతం దేశం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందుకు సంబంధించి అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశీయ సోలార్‌ పరికరాల పరిశ్రమ దేశీయ దిగుమతుల నేపథ్యంలో మరింత పతనం అవుతోంది. స్వావలంభన భారత్‌ దిశలో భాగంగా సోలార్‌ ఇన్వర్టర్లు, ల్యాంప్‌లపై దిగుమతి సుంకం పెంపును ఆర్థికమంత్రి సీతారామన్‌ ఫిబ్రవరి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 

‘‘సౌర ఇంధనం భారత్‌కు ఎంతో విశ్వసనీయమైనదిగా ఇప్పటికే గుర్తించాము. సోలార్‌ సెల్స్, సోలార్‌ ప్యానెళ్ల దశల వారీ దేశీయ తయారీ ప్రణాళికను నోటిఫై చేస్తాము. ప్రస్తుతానికి దేశీయ తయారీని ప్రోత్సహించేం దుకు సోలార్‌ ఇన్వర్టర్లపై డ్యూటీని 5 శాతం నుంచి 20 శాతానికి, సోలార్‌ ల్యాంటర్న్‌లపై 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నాము’’అంటూ బడ్జెట్‌లో భాగంగా మంత్రి ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సోలార్‌ పవర్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేయడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలోనే  సోలార్‌ మాడ్యూల్స్‌ దిగుమతులపై సుంకాన్ని విధించాలన్న  ప్రతిపాదనకు ఆర్థికశాఖ అమోదముద్ర  గమనార్హం. ప్రస్తుతం భారత్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గెగావాట్లు. 

మరిన్ని వార్తలు