మిస్త్రీ ఎఫెక్ట్‌: షాపూర్‌జీ కంపెనీల హైజంప్‌

23 Sep, 2020 12:40 IST|Sakshi

టాటా సన్స్‌ నుంచి వైదొలగనున్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌

టాటా గ్రూప్‌లో వాటా విక్రయం ద్వారా భారీగా లభించనున్న నిధులు

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ రుణ చెల్లింపులకు చాన్స్‌- షేరు జూమ్‌‌

బీఎస్‌ఈలో ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌

కొద్ది నెలలుగా నలుగుతున్న వివాదాల నేపథ్యంలో టాటా సన్స్‌ నుంచి వైదొలగవలసిన అవసరమున్నట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. టాటా సన్స్‌లో షాపూర్‌జీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటా ఉంది. తద్వారా టాటా గ్రూప్‌లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్‌ అతిపెద్ద వాటాదారుగా నిలుస్తూ వస్తోంది. వాటా విక్రయం ద్వారా రెండు గ్రూపుల మధ్య సుమారు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధానికి తెరపడనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా)

వాటా కొనుగోలు
షాపూర్‌జీ గ్రూప్‌ వాటాను మార్కెట్ ధరకే కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు ఇటీవల టాటా సన్స్‌ ప్రకటించింది. మరోవైపు టాటా సన్స్‌లో వాటా విక్రయం ద్వారా షాపూర్‌జీ గ్రూప్‌నకు భారీగా నిధులు సమకూరనున్నాయి. రూ. 1.5 లక్షల కోట్లు లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా షాపూర్‌జీ గ్రూప్‌ రుణ భారం భారీగా పెరిగినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తద్వారా గ్రూప్‌ కంపెనీల రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలు చిక్కనున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండ్‌టు ఎండ్‌ సోలార్‌ ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది.   

షేర్లు జూమ్
జూన్‌కల్లా స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌లో షాపూర్‌జీ గ్రూప్‌ వాటా 50.58 శాతంగా నమోదైంది. కంపెనీ ఆర్డర్‌బుక్‌ విలువ రూ. 5,696 కోట్లను తాకింది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలోనే 1 గిగావాట్‌ ఆర్డర్లు సంపాదించింది. వీటి విలువ రూ. 3,633 కోట్లుకాగా.. ఎన్‌ఎస్‌ఈలో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ షేరు 20 శాతం దూసుకెళ్లింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడంతో రూ. 39 ఎగసి రూ. 236 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇక మరోవైపు బీఎస్‌ఈలో ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ సైతం 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 71 ఎగసి రూ. 1484 వద్ద ఫ్రీజయ్యింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా