ముందుకెళ్లేందుకు ఆస్కారం..!

17 May, 2021 00:01 IST|Sakshi

ఊరటనిస్తున్న కరోనా కేసుల తగ్గుదల 

ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు 

మెప్పిస్తున్న కార్పొరేట్‌ మార్చి ఆర్థిక ఫలితాలు 

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి సారింపు 

ఈ వారం మార్కెట్‌ గమనంపై స్టాక్‌ నిపుణుల అంచనా

ముంబై: సూచీలు ఈ వారంలో ముందడుగు వేసే అవకాశం ఉందని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు. గత వారంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్‌ కొరతను తీర్చేందుకు కేంద్రం రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ వీ దిగుమతికి అనుమతినిచ్చింది. కార్పొరేట్‌ కంపెనీల మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లు నష్టాలను వీడి లాభాల బాటపట్టాయి. క్రితం వారంలో డాలర్‌ మారకంలో రూపాయి బలపడింది. అంచనాలకు తగ్గట్లు ఏప్రిల్‌ నెల స్థూల ఆర్థిక గణాంకాలు విడుదలయ్యాయి. ఈ అంశాలన్నీ మార్కెట్‌కు మద్దతు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


ఆందోళనలు దాగున్నాయ్‌..! 
మార్కెట్‌ను ముందుకు నడిపే అంశాలున్నప్పటికీ.., కొన్ని ఆందోళనలు మాత్రం ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. టీకా సరఫరాపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు విక్రయాలను ఆపడం లేదు. ఈ ప్రతికూల వార్తలు సూచీల లాభాలన్ని పరిమితం చేయవచ్చని స్టాక్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కమోడిటీ ధరల ప్రభావంతో గత వారం సెన్సెక్స్‌ 474 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయాయి. 


ఈ అంశాలపై ఇన్వెస్టర్ల దృష్టి ... 
కార్పొరేట్‌ క్యూ4 ఫలితాలు, వ్యాక్సినేషన్, కరోనా సంబంధిత వార్తలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులను కూడా నిశితంగా పరిశీలింవచ్చు. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి, క్రూడాయిల్‌ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు కూడా సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. 


కార్పొరేట్‌ ఫలితాలు... 
కార్పొరేట్‌ మార్చి క్వార్టర్‌ ఫలితాల ప్రకటన అంకంలో ఇది ఆరో వారం. ఈ మే నెల మూడో వారంలో 170 కంపెనీలు తమ నాలుగో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నిఫ్టీ – 50 ఇండెక్స్‌లోని కంపెనీల షేర్లైన భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఐఓసీ, ఎస్‌బీఐ, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇందులో ఉన్నాయి. వీటితో పాటు గ్లాండ్‌ ఫార్మా, కోల్గేట్, ఫెడరల్‌ బ్యాంక్, టొరెంటో ఫార్మా, పీఐ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, హావెల్స్, హిందూస్థాన్‌ పెట్రోలియం, రెలాక్సో ఫుట్‌వేర్స్, యూనిటెడ్‌ స్పిరిట్స్‌ వంటి ప్రధాన కంపెనీలు ఇదే వారంలో ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. 


స్థూల ఆర్థికాంశాలపై దృష్టి... 
నేడు(సోమవారం) హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు ఏప్రిల్‌ తయారీ రంగ డేటా విడుదల కానుంది. ఇదే రోజున చైనా ఏప్రిల్‌ నెల పారిశ్రామికోత్పత్తి డేటాను అలాగే రిటైల్‌ అమ్మకాల గణాంకాలు విడుదల చేయనుంది. అమెరికా గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ను,శుక్రవారం మార్కిట్‌ తయారీ రంగ గణాంకాలను ప్రకటించనుంది. ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగల ఈ స్థూల ఆర్థిక గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించే అవకాశం ఉంది. 


ఎఫ్‌ఐఐలు అమ్మేస్తున్నారు 
భారత స్టాక్‌ మార్కెట్‌లో ఇటీవల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అవకాశం ఉన్నంత మేర అమ్మేస్తున్నారు. మే 1–14లో నాటికి ఈక్విటీ, డెట్‌ మార్కెట్ల నుంచి రూ.6,452 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ను రూ.6,427 కోట్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.25 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా చెబుతోంది. రెండో దశ కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు