వ్యాక్సిన్ల వార్తలే కీలకం..!

7 Dec, 2020 03:12 IST|Sakshi

తెరపైకి అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం

ముంబై: కోవిడ్‌ –19 వ్యాక్సిన్లపై ఆశలు, అమెరికా తాజా ఉద్దీపన ప్యాకేజీ వార్తలే ఈ వారంలో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, రెండో దశ కరోనా కేసుల నమోదు పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. వీటితో పాటు దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలర్‌ మారకంలో రూపాయి, క్రూడాయిల్‌ కదలికలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి.

కొన్ని వారాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ ప్రకటనతో పాటు వారంతపు రోజున ఆర్‌బీఐ ప్రకటించిన ద్రవ్య పాలసీ విధానం మార్కెట్‌ను మెప్పించడంతో మార్కెట్‌ వరుసగా ఐదోవారమూ లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లన్నీ వ్యాక్సి న్ల వైపే దృష్టి సారించాయి. ఇప్పటికే ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. అమెరికా సైతం ఫైజర్‌ వ్యాక్సిన్‌ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతి కోరింది. తాజాగా దేశీయ ఫార్మా సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు పరీక్షల్లో సత్ఫలితాలను ఇస్తుండడంతో మార్కెట్లో మరింత ఆశావహ అంచనాలు నెలకొన్నాయి.

ఐపీఓకు సిద్ధమైన ఐఆర్‌ఎఫ్‌సీ
ప్రభుత్వ రంగానికి చెందిన తొలి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ప్రాథమిక మార్కెట్లో నిధుల సమీకరణకు సిద్ధమైంది. భారత రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) కంపెనీ రూ.4600 కోట్ల ఐపీఓ ఇష్యూ డిసెంబర్‌ మూడోవారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐపీఓ ఆఫర్‌ ద్వారా ఐఆర్‌ఎఫ్‌సీ 178.21 కోట్ల ఈక్విటీ షేర్లను, అలాగే 118.80 కోట్ల తాజా ఈక్విటీలను ఆఫర్‌ చేయనుంది.  మార్కెట్‌ పరిస్థితులు సవ్యంగా ఉంటే ఈ డిసెంబర్‌ మూడో వారంలో ఇష్యూ ప్రక్రియను చేపడతామని లేదంటే జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఐపీఓ ఉండొచ్చని కంపెనీ చైర్మన్‌ అమితాబ్‌ బెనర్జీ తెలిపారు.

రిటైల్, పారిశ్రామిక గణాంకాలు కీలకమే
ఈ శుక్రవారం(11న) నవంబర్‌ నెల రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు, అక్టోబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజున డిసెంబర్‌ 4తో ముగిసిన వారం ఫారెక్స్‌ నిల్వల డేటాను ఆర్‌బీఐ విడుదల చేయనుంది. ద్రవ్యపాలసీ విధాన ప్రకటన సందర్భంగా జీడీపీ పురోగతి బాట పట్టినట్లు ఆర్‌బీఐ అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు.  

వెల్లువలా విదేశీ పెట్టుబడులు  
ఇటీవల కాలంలో ఎఫ్‌ఐఐలు దేశీయ ఈక్విటీలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నా రు. ఈ డిసెంబర్‌ మొదటి వారంలో ఎఫ్‌ఐఐలు రూ.17 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొన్నారు. గత నెలలో నికరంగా రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. వచ్చే ఏడాది(2021) జనవరి వరకు ఎఫ్‌ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో డీఐఐ(దేశీ ఫండ్స్‌) లాభాల స్వీకరణతో నికర అమ్మకందారులుగా మారారు. ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా ఉందని విశ్లేషకులంటున్నారు.  

9 నెలల గరిష్టానికి క్రూడాయిల్‌ ధర
భారత్‌ లాంటి వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల క్రూడాయిల్‌ కదలికలూ ఈ వారం కీలకంగా మారాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు ఆర్థిక పురోగతి ఆశలతో గత శుక్రవారం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్‌ ధర 9 నెలల గరిష్ట స్థాయి 49.25 డాలర్లను అందుకుంది. క్రూడాయిల్‌ కదలికలు కేవలం స్టాక్‌ మార్కెట్‌పై మాత్రమే కాకుండా రూపాయి ట్రేడింగ్‌పైనా ప్రభావాన్ని చూపుతాయి.  

అంతర్జాతీయ పరిణామాలు
సెకండ్‌ వేవ్‌ లో భాగంగా అమెరికా, యూరోపియన్‌ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రపంచ ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ మంగళవారం (డిసెంబర్‌ 4న) యూరోజోన్‌తో పాటు జపాన్‌ దేశపు క్యూ3 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్నాయి. చైనా బుధవారం(డిసెంబర్‌ 5న) నవంబర్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. గురువారం(డిసెంబర్‌ 6న) యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) వడ్డీరేట్లపై తన విధానాన్ని ఇదేరోజున అమెరికా నవంబర్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడి చేయనుంది.

మరిన్ని వార్తలు